
- ఖైరతాబాద్ గణపతికి కనులు దిద్దిన కళాకారులు
- పూర్తైన విశ్వశాంతి మహాశక్తి గణపతి పనులు అట్టహాసంగా ఆగమనం
హైదరాబాద్ సిటీ, వెలుగు: రెండు రోజుల ముందుగానే ఖైరతాబాద్ బడా గణేశుడు భక్తులకు దర్శనమిచ్చాడు. విగ్రహ తయారీలో చివరి అంకమైన నేత్రాలు దిద్దడం పూర్తైంది. 69 అడుగుల ‘శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి’కి సోమవారం ఉదయం కళాకారులు నేత్రాలు దిద్దారు. సాయంత్రం డీజేలు, మహారాష్ట్ర బ్యాండ్, భక్తుల జయజయ ధ్వానాల మధ్య బడా గణేశ్ ఆగమనం అట్టహాసంగా జరిగింది. కార్యక్రమానికి
ఎమ్మెల్యే దానం నాగేందర్ హాజరై, డీజేలకు అనుమతిచ్చిన పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో ప్రభుత్వం భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేసిందన్నారు. ఆగమనం అనంతరం రెండు రోజుల ముందుగానే భక్తులకు మహాగణపతిని దర్శించుకునే అవకాశం లభించింది.
27న ఉదయం 10 గంటలకు ప్రాణ ప్రతిష్ట
ఆగస్టు 27న వినాయక చవితి రోజు ఉదయం 10 గంటలకు ఖైరతాబాద్లో శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతికి పూజా కార్యక్రమం జరగనుంది. 20 మంది సిద్ధాంతులు కలశపూజ, ప్రాణప్రతిష్ట నిర్వహిస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గవర్నర్, పలువురు నేతలు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు.