
హైదరాబాద్: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వ్యాఖ్యలు తెలంగాణ అసెంబ్లీలో కాక రేపాయి. హైదరాబాద్ అభివృద్ధికి సంబంధించిన చర్చలో భాగంగా మాట్లాడిన ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై విరుచుకుపడ్డారు. దానం మాట్లాడుతుండగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. ఈ పరిణామంతో ఆగ్రహానికి లోనైన దానం నాగేందర్.. ఒక్కొక్కరి తోలు తీస్తానంటూ బీఆర్ఎస్ సభ్యులను హెచ్చరించారు. మీ బండారం బయటపెడ్తానంటూ దానం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోసారి ఎమ్మెల్యేగా గెలిచానని ఈ సందర్భంగా దానం నాగేందర్ గుర్తుచేశారు.
దానం వ్యాఖ్యలపై దుమారం రేగడంతో ఆయన వివరణ ఇచ్చారు. తాను వాడిన పదాలు వాడుక భాషలోవేనని ఆయన చెప్పుకొచ్చారు. అయితే.. బీఆర్ఎస్ సభ్యులతో పాటు అకర్బుద్దీన్ ఒవైసీ కూడా దానం వాడిన పదజాలంపై అభ్యంతరం తెలిపారు. సభలో అసభ్య పదజాలం తగదని హితవు పలికారు. అసభ్య పదాలను రికార్డుల నుంచి తొలగిస్తామని స్పీకర్ గడ్డం ప్రసాద్ చెప్పారు.