
కొద్ది దూరం నడిచి వెళ్లి పరిశీలించిన టీఆర్ఎస్ లోక్ సభాపక్ష నేత, ఎంపీ నామ నాగేశ్వరరావు
ఖమ్మం: భారీ వర్షాలకు ఖమ్మం-అశ్వారావుపేట హైవే బాగా దెబ్బతినింది. పెనుబల్లి వద్ద దెబ్బతిన్న హైవేను ఎన్.హెచ్.ఏ.ఐ (NHAI) అధికారులతో కలసి వెళ్లి పరిశీలించారు టీఆర్ఎస్ లోక్సభా పక్ష నేత, ఎంపీ నామా నాగేశ్వరరావు, కొద్ది దూరం వరుకు నడిచి వెళ్లి మరీ పరిశీలించారాయన. నియోజకవర్గ పర్యటనలో భాగంగా ఖమ్మం నుండి బయల్దేరి వెళ్లిన నామ నాగేశ్వరరావు మార్గం మధ్యలో పెనుబల్లి వద్ద ఆగారు. హైవే అథారిటీ అధికారులతో కలిసి ఖమ్మం – అశ్వారావుపేట నేషనల్ హైవే రోడ్డు పై కొద్ది దూరం వరుకు నడచి వెళ్లి దెబ్బతిన్న రోడ్డును పరిశీలించారు. రోడ్డు పై ఏర్పడిన గుంతలను మరమ్మతులు చేయడంలో అధికారులు అలసత్వం చేయకుండా వెంటనే రోడ్డు మరమ్మతులు చేయాలని ఎంపీ నామ సూచించారు. రోడ్డు మరమ్మతులు యుద్ధప్రాతిపదికన చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మరమ్మతుల అవసరాల కోసం ఎస్టిమేషన్ వేసి కేంద్రానికి పంపించామని.. అయితే అందుకు కావాల్సిన నిధులు ఇంకా రాలేదు అని హైవే అధికారులు ఎంపీ నామ దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయమై ఎంపీ నామ నాగేశ్వరరావు స్పందించి కేంద్రంతో వెంటనే తాను మాట్లాడతానని.. నిధులు విడుదలయ్యేలా చూస్తానన్నారు. నిత్యం వందలాది వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే రోడ్డుపై గుంతలు ఏర్పడం వల్ల వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని.. అలా జరగకుండా గట్టి చర్యలు తీసుకోవాలని అధికారులకు ఎంపీ నామ సూచించారు.