- చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక కార్యాచరణ
- ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
ఖమ్మం టౌన్, వెలుగు : జిల్లాలో గ్రానైట్ ఇండస్ట్రీకి ప్రభుత్వం అంగా ఉంటుందని, ఈ పరిశ్రమ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. గ్రానైట్ రంగం ద్వారా వేల కుటుంబాలకు జీవనోపాధి లభిస్తుందని, త్వరలోనే పరిశ్రమ ప్రతినిధులతో విస్తృత సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు. సోమవారం ఖానాపురంలోని ఇండస్ట్రియల్ కాలనీ గ్రానైట్ పారిశ్రామిక ప్రాంతాన్ని కలెక్టర్ సందర్శించారు. యూనిట్ నిర్వాహకులు, పారిశ్రామిక వేత్తలు, కార్మికులతో మాట్లాడి సమస్యలపై ఆరా తీశారు.
విద్యుత్ ఛార్జీలు, ఎగుమతి సమస్యలు, డిమాండ్ తగ్గుదల, రవాణా వ్యయాలు లాంటి పలు అంశాలపై చర్చించారు. పరిశ్రమల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా చూస్తామని హామీ ఇచ్చారు. కలెక్టర్ వెంట జిల్లా పరిశ్రమలు శాఖ జనరల్ మేనేజర్ సీతారాం నాయక్, ఖమ్మం ఆర్డీవో నరసింహారావు, టీజీ ఐఐసీ డీఈ స్మరత్ చంద్ర, జేఈ శివకుమార్, ఖమ్మం అర్బన్ మండల తహసీల్దారు సైదులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
రిపోర్ట్ చేయకుంటే చర్యలు
రిటర్నింగ్ అధికారులు సంబంధిత మండలంలో రిపోర్ట్ చేయకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అనుదీప్ హెచ్చరించారు. ఎన్నికల నియమావళి కచ్చితంగా పాటిస్తూ, ఎన్నికలు స్వేచ్ఛగా నిర్వహించేందుకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. మొదటి విడత పంచాయతీ ఎన్నికల నిర్వహణపై అధికారులతో ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈనెల 11, 14, 17న మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని, రాబోయే 8 రోజులు ముందస్తు ప్రణాళికతో సజావుగా ఎన్నికలు నిర్వహించాలని సూచించారు. ర్యాండమైజేషన్ ద్వారా పోలింగ్ సిబ్బందిని కేటాయించామని, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల వద్దకు సకాలంలో పోలింగ్ బృందాలు చేరుకోవడంతో పాటు సంబంధిత రిటర్నింగ్ అధికారికి రిపోర్ట్ చేయాలని స్పష్టం చేశారు.
డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాలు ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్లు పెద్ద వాహనాలు వెళ్లేందుకు వీలుగా ఏర్పాటు చేయాలన్నారు. 174 పోలింగ్ లోకేషన్ లో 992 పోలింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు, వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కేంద్రాల వద్ద సిబ్బందికి అన్ని సౌకర్యాలు ఉండేలా చూడాలని ఆదేశించారు. ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. ఈ టెలీ కాన్ఫరెన్స్ లో స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ, ఎన్నికల నోడల్ అధికారులు, రిటర్నింగ్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

