- ఎన్ సీసీ డే వేడుకల్లో ఖమ్మం కలెక్టర్ అనుదీప్
ఖమ్మం టౌన్, వెలుగు : వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకుంటే విజయం తథ్యమని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. వైఫల్యాలు లేకుండా గొప్ప స్థానానికి ఎదిగిన వ్యక్తులు సమాజంలో ఎవరూ కనబడరన్నారు. ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కళాశాల ఆడిటోరియంలో ఆదివారం నిర్వహించిన ఎన్ సీసీ డే వేడుకల్లో ఆయన మాట్లాడారు.
ప్రతి ఒక్కరూ ఒక నిర్ధిష్ట లక్ష్యాన్ని పెట్టుకొని, దానిని సాధించే దిశగా కృషి చేయాలన్నారు. 20 లక్షలకు పైగా యువత సభ్యత్వంతో ఎన్సీసీ పని చేస్తోందని, ఇందులో భాగస్వామ్యం కావడం విద్యార్థుల అదృష్టమని చెప్పారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత దేశంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం వికసిత్ భారత్ కార్యక్రమం చేపట్టిందని, యువత తమ వద్ద అందుబాటులో ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే గొప్ప ఫలితాలు సాధిస్తారని తెలిపారు.
విద్యార్థులు ప్రదర్శించిన దేశభక్తి గీతాలతో చేసిన పలు రకాల నృతాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఎన్ సీసీ కమాండెంట్ నవీన్ యాదవ్, ఎస్ కే భద్ర, పలు విద్యాసంస్థ నిర్వాహకులు రవిమారుతి, పార్వతీ రెడ్డి, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
