ప్రతి ఓటరు వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలి : ఖమ్మం కలెక్టర్ దివాకర

ప్రతి ఓటరు వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలి : ఖమ్మం కలెక్టర్ దివాకర

ఖమ్మం టౌన్, వెలుగు : ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం ద్వారా ప్రతి ఓటరు వివరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ, మ్యాపింగ్ ప్రక్రియ మరింత వేగవంతంగా చేయాలని ఖమ్మం కలెక్టర్ దివాకర అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ లో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) అంశంపై కలెక్టర్ అడిషనల్​ కలెక్టర్ పి.శ్రీజ, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్యతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు చేపట్టిన మ్యాపింగ్ వివరాలను మండలాల వారీగా పరిశీలించి, పలు సూచనలు చేశారు. 

ఈ కార్యక్రమంలో పాల్గొని సరైన వివరాలు అందించేలా తద్వారా ఖచ్చితమైన ఓటరు జాబితా తయారీలో రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని కలెక్టర్ కోరారు. జూన్ 25 నుంచి జులై 24 వరకు బూత్ లెవల్ అధికారులు ప్రతి ఇంటిని సందర్శించి ఓటర్ల వివరాలను పూర్తి స్థాయిలో ధృవీకరించాలని ఆదేశించారు. అంతకుముందు హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సి.సుదర్శన్ రెడ్డి ఎస్ఐఆర్ -2026 ప్రక్రియ నిర్వహణ, శిక్షణ, ఇతర అంశాలపై జిల్లా కలెక్టర్లు, ఎన్నికల అధికారులకు ఉన్నత స్థాయి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించి, దిశానిర్దేశం చేశారు. ఈ వీసీలో కలెక్టర్ దివాకర పాల్గొన్నారు.