- ఏన్కూర్, జన్నారం, ఆరికాయలపాడు, నాచారం, గౌరారంలో ఆగిన ఎన్నికలు
పెనుబల్లి, వెలుగు : వచ్చే నెలలో జరగబోయే పంచాయతీ ఎన్నికలకు ఖమ్మం జిల్లాలోని ఐదు గ్రామాలు దూరం కానున్నాయి. ఏన్కూర్ మండల కేంద్రంతోపాటు జన్నారం, ఆరికాయలపాడు, నాచారం, పెనుబల్లి మండలం గౌరారం గ్రామాల్లో హైకోర్టు ఉత్తర్వులతో ఈసారి ఎన్నికలు జరగడం లేదు. 1949లో హైదరాబాద్ సంస్థానం ట్రైబల్ ఏరియాలను డిక్లేర్ చేసింది. అప్పటికే ఆయా పంచాయతీలు ప్లేయిన్ ఏరియాలో ఉన్నాయి.
అనంతరం 1950లో రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత ఆయా గ్రామాలు ప్లేయిన్ ఏరియా నుంచి ఏజెన్సీలోకి మారిపోయాయి. 1950లో రాష్ట్రపతి ఇచ్చిన జీవో నెంబర్ 26 లో షెడ్యూల్ ఏరియా జాబితాలో లేని ఆయా పంచాయతీలను ఏజెన్సీ లోకి ఎలా మార్చారాంటూ ప్రభుత్వాన్ని సవాల్ చేస్తూ కొంతమంది గత సెప్టెంబర్ లో హై కోర్టులో పిటిషన్ వేశారు.
దీనికి సంబంధించిన కేసు కోర్టులో ఉన్నందున తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఆయా పంచాయతీల్లో ఎన్నికలు నిలిపి వేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘ అధికారులకు ఆర్డర్ జారీ చేసింది. దీంతో ఐదు పంచాయతీలు ఈసారి ఎన్నికలకు దూరం కానున్నాయి.
