ఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

ఖమ్మం టౌన్, వెలుగు: గతంలో నిధులు రావడమే కష్టంగా ఉండేదని, ఇప్పుడు వరదలా వస్తున్న నిధులతో గ్రామాలను అభివృద్ధి చేసుకుంటున్నామని మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​అన్నారు. ఆదివారం రఘునాథపాలెం మండలం బుడిదంపాడులో రూ.58 లక్షలతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించారు. గ్రామంలోని ప్రభుత్వ స్కూల్​లో నిర్మించనున్న అదనపు తరగతి గది నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. కోయచలకలో రూ.48 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లు,  డ్రైన్ నిర్మాణ పనులను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ మూడేళ్లలో  ఒక్క కోయచలక గ్రామాభివృద్ధికి రూ.14కోట్లు కేటాయించినట్లు చెప్పారు. మన అభివృద్ధిపై ఇటీవల సీఎం కేసీఆర్  ఓ సమావేశంలో వ్యాఖ్యానించడం మనకు గర్వకారణమన్నారు. మన అభివృద్ధిని చూడటానికి మంగళవారం నిజామాబాద్ నుంచి కలెక్టర్, వివిధ మున్సిపాలిటీల చైర్మన్లు, ఎమ్మెల్యేలు రానున్నారని, ఇలాంటి కీర్తి మనకు దక్కడం అదృష్టమన్నారు. అనంతరం కొత్తగా మంజూరైన ఆసరా పెన్షన్ల గుర్తింపు కార్డులను లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ లక్ష్మీ ప్రసన్న, వైస్ ఎంపీపీ గుత్తా రవి, డీఆర్డీవో విద్యా చందన, సర్పంచ్ మాదంశెట్టి హరిప్రసాద్, ఉప సర్పంచ్ పూర్ణ చందర్, లీడర్లు మద్దినేని వెంటకరమణ, నర్సింహారావు పాల్గొన్నారు. 

ఆదివాసీ చట్టాలు ఉల్లంఘిస్తే సహించం

చండ్రుగొండ, వెలుగు: ఏజెన్సీలో ఆదివాసీ చట్టాలు ఉల్లంఘించి గొత్తికోయ కుటుంబాలను బలవంతంగా ఖాళీ చేయించాలని చూస్తే సహించేదిలేదని  లెఫ్ట్​ పార్టీల లీడర్లు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆదివారం చండ్రుగొండ మండలం ఎర్రబోడులో సీపీఐ జల్లా కార్యదర్శి సాబీర్ పాషా, సీపీఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, ఎన్డీ జిల్లా కార్యదర్శి మధు, ప్రజాపంథా జిల్లా కార్యదర్శి సత్యనారాయణ పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎఫ్ఆర్ వో హత్య ను సాకుగా చూపించి గొత్తికోయలను బయటికి పంపాలన్న ఆఫీసర్ల  ప్రయత్నాలు విరమించుకోవాలని తెలిపారు. పోడు భూములకు పట్టాలివ్వాలని డిమాండ్ చేశారు. ఎఫ్ఆర్వో హత్య అమానుషమని వారి కుటుంబానికి సంతాపం తెలిపారు.

ఎఫ్ఆర్ఓ ఫ్యామిలీని పరామర్శించిన తుమ్మల

ఖమ్మం టౌన్,వెలుగు : ఇటీవల గొత్తికోయల చేతిలో హత్యకు గురైన ఎఫ్ఆర్ఓ శ్రీనివాసరావు  కుటుంబాన్ని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరామర్శించారు. ఆదివారం రఘునాథపాలెం మండలం ఈర్లపూడి గ్రామంలోని చలమల శ్రీనివాసరావు ఇంటికి వెళ్లి భార్య, పిల్లలను పరామర్శించారు. శ్రీనివాసరావు ఫొటోకు పూలమాల వేసి తుమ్మల నివాళులర్పించారు. శ్రీనివాసరావు కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో టీఆర్ఎస్​ లీడర్లు గుత్తా వెంకటేశ్వరరావు, తాతా రఘురాం, ఎలగొండ స్వామి, సుడా డైరెక్టర్ ఖాదర్ బాబు పాల్గొన్నారు.

టీఆర్ఎస్​ను ముక్కలు చేయాలని చూస్తున్నరు

మధిర, వెలుగు: ఖమ్మం జిల్లాలో టీఆర్​ఎస్​లోని కొందరు లీడర్లు పార్టీని ముక్కలు చేయాలని చూస్తున్నారని లీడర్లు బొమ్మెర రామ్మూర్తి, డాక్టర్​ కోట రాంబాబు తెలిపారు. ఆదివారం మధిర పట్టణంలోని డాక్టర్​ రాంబాబు ఇంట్లో మీడియాతో మాట్లాడుతూ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లాలో టీఆర్ఎస్ బతికిస్తున్నారన్నారు. హైకమాండ్​అనుమతి లేకుండా ముందే అభ్యర్థిని ప్రకటించటం ఏంటని ప్రశ్నించారు. పార్టీ జెండా కింద పనిచేసేందుకు అన్ని ఎన్నికల్లో కష్టపడ్డామని, గ్రూపు తగాదాల వల్ల ఇతర పార్టీలు లాభపడుతున్నాయన్నారు. మధిర నియోజకవర్గంలో కొందరు నేతలు మాదిగలకు అన్యాయం చేస్తున్నారని తెలిపారు. 

ధాన్యం సేకరణ స్పీడప్​ చేయాలి : కలెక్టర్ గౌతమ్

ఖమ్మం టౌన్, నేలకొండపల్లి, వెలుగు: జిల్లాలో ధాన్యం సేకరణను స్పీడప్​చేయాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. ఆదివారం నేలకొండపల్లి మండలం నాచేపల్లి, ఆచార్యగూడెం వడ్ల కొనుగోలు సెంటర్లను కలెక్టర్​తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వరి కోతలు చాలా చోట్లా పూర్తయ్యాయని, వడ్లు కొనేందుకు జిల్లా వ్యాప్తంగా 221 కొనుగోలు సెంటర్లను ప్రారంభించామన్నారు. ప్రతి సెంటర్​లో గన్నీ బ్యాగులు, మాయిశ్చర్​మిషన్, తూర్పారబట్టే యంత్రం, టార్పాలిన్ లు అందుబాటులో ఉంచామన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ సెంటర్లలో వడ్లను పరిశీలించారు. ఏ రోజు సేకరించింది అదేరోజు రవాణా అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కౌలు రైతుల జాబితా తయారుచేసి, ముందస్తుగా టోకెన్లు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్, శిక్షణ సహాయ కలెక్టర్ రాధిక గుప్తా, ఇన్​చార్జి డీఏవో సరిత, డీసీవో విజయ కుమారి, తహసీల్దార్ ప్రసాద్ పాల్గొన్నారు. 

ఓటరు నమోదు ప్రక్రియ పరిశీలన 

ఖమ్మం టౌన్, వెలుగు: ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమ అమలు తీరును కలెక్టర్ గౌతమ్ ఆదివారం క్షేత్ర స్థాయిలో తనిఖీ చేశారు. ఆదివారం సిటీలోని డీఈవో, డీఎఫ్​వో ఆఫీసు, జడ్పీ హైస్కూల్​లో ఏర్పాటు చేసిన ఓటర్​నమోదు సెంటర్లను కలెక్టర్​పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలింగ్ సెంటర్ల వారీగా అర్హులైన కొత్త ఓటర్లను గుర్తించాలన్నారు. గొల్లబజార్ లో ఇంటింటికి వెళ్లి, ఇంట్లో ఎంతమంది ఉన్నారు.. 17ఏండ్లు నిండినవారు, కొత్తగా పెళ్లి చేసుకున్నవారు ఉన్నారా అని ఆరా తీసి ఓటు నమోదు చేసుకున్నారో లేదా అని అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్​వెంట ఖమ్మం మున్సిపల్​కమిషనర్​ ఆదర్శ్ సురభి, శిక్షణ అసిస్టెంట్ కలెక్టర్ రాధిక గుప్తా, ఖమ్మం అర్బన్ తహసీల్దార్ శైలజ, బూత్ స్థాయి అధికారులు ఉన్నారు. 

టీఆర్ఎస్తోనే సంక్షేమం, అభివృద్ధి

ఎర్రుపాలెం, వెలుగు: రాష్ట్రంలో టీఆర్ఎస్ తోనే సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయని పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాత మధుసూదన్​ అన్నారు. ఆదివారం ఎర్రుపాలెం మండలం బుచ్చిరెడ్డిపాలెం సమీపంలోని మామిడి తోటలో జరిగిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు. 60 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. కల్యాణ లక్ష్మి, 24 గంటలు ఉచిత కరెంటు, రైతు బీమా, రైతు బంధు, దళిత బంధు.. తదితర పథకాలు, టీఆర్ఎస్​ ప్రభుత్వంతోనే సాధ్యమైందన్నారు. అనంతరం జడ్పీ చైర్మన్​ లింగాల కమల్ రాజు మాట్లాడుతూ సంక్షేమ పథకాలకు ఎమ్మెల్యే భట్టి విక్రమార్క పోస్ట్ మాన్ గా పనిచేస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలతో పేద, మధ్యతరగతి ప్రజలపై భారం పడుతోందన్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి మధిర నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థిని గెలిపించాలన్నారు. కార్యక్రమంలో మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు, టీఆర్ఎస్ జిల్లా నాయకుడు చావా రామకృష్ణ, ఎంపీపీ శిరీష, జడ్పీటీసీ కవిత, మండలాల లీడర్లు పాల్గొన్నారు. 

యూఎన్​వో ఆశయాలకు కేంద్రం తూట్లు : ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్

సత్తుపల్లి, వెలుగు: కేంద్ర ప్రభుత్వం రూపొందిస్తున్న కొత్త అటవీ సంరక్షణ నియమాలు, ఆదివాసీల రక్షణ కోసం ఐక్యరాజ్యసమితి(యూఎన్​వో)  పేర్కొన్న ఆశయాలకు తూట్లు పొడిచేలా ఉన్నాయని  పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ అన్నారు. ఆదివారం ఉమ్మడి జిల్లా పౌర హక్కుల సంఘం 17వ మహాసభలను సత్తుపల్లిలో లాయర్​ కొండపల్లి విజయ్ కుమార్ ప్రారంభించారు. జిల్లా అధ్యక్షుడు 
 కూకలకుంట రవి అధ్యక్షతన జరిగిన ఈ సభల్లో ప్రొఫెసర్​లక్ష్మణ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.నారాయణ రావు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ ఎటువంటి గ్రామసభలు, పర్యావరణ అనుమతులు లేకుండానే అడవిలో నిక్షిప్తమైన ఖనిజ సంపదను బహుళ జాతి కంపెనీలకు అప్పగించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్తగా అటవీ సంరక్షణ నియమాలను రూపొందిస్తోందని ఆరోపించారు. అటవీ సంపదను ప్రభుత్వ ఆస్తులుగా పేర్కొనడం రాజ్యాంగ విరుద్ధమని, ఆది నుంచి అటవీ సంపద ఆదివాసీలకే చెందుతుందన్నారు. తెలంగాణాలో పోడు భూముల హక్కుల ఉల్లంఘన జరుగుతోందన్నారు. ఆదివాసీలు సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్​చేశారు. ఈ మహాసభల్లో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పి. విప్లవ కుమార్, డి.శిరీష, ఎస్.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

రామాలయంలో మూలవరులకు అభిషేకం

భద్రాచలం, వెలుగు : శ్రీసీతారామచంద్రస్వామికి మూలవరులకు ఆదివారం గర్భగుడిలో పంచామృతాలతో అభిషేకం, అనంతరం సువర్ణ పుష్పాలతో అర్చన జరిగింది. ముందుగా గోదావరి నుంచి తీర్ధబిందెను తెచ్చి సుప్రభాత సేవను చేశారు. బాలబోగం నివేదించారు. తర్వాత సమస్త నదీజలాలు, పంచామృతాలతో తిరుమంజనం నిర్వహించారు. అభిషేక జలాలను భక్తులపై చల్లి మంజీరా(పసుపు ముద్ద) మహిళలకు పంపిణీ చేశారు. జీయర్​స్వామి సమర్పించిన బంగారు పుష్పాలతో సువర్ణ పుష్పార్చనను చేయగా ఈ వేడుకలో భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కల్యాణమూర్తులను ప్రాకార మండపానికి తీసుకొచ్చి నిత్య కల్యాణం నిర్వహించారు. భక్తులు కంకణాలు ధరించి స్వామి కల్యాణ తంతును చేశారు. మాధ్యాహ్నిక ఆరాధనలు తర్వాత రాజబోగం నివేదించారు. సాయంత్రం దర్బారు సేవ జరిగింది. గీతాజయంతి, సర్వేకాదశి సందర్భంగా తిరువీధి,చుట్టుసేవలు నిర్వహించి పవళింపు సేవను నిలిపివేశారు.