ఖమ్మం జిల్లా: వివాహేతర సంబంధాన్ని చూశాడనే కారణంతో ఓ పదో తరగతి విద్యార్థిని దారుణంగా హత్య చేసిన ఘటన ఖమ్మం జిల్లాలో కలకలం రేపింది. తమ సంబంధం గురించి కుటుంబ సభ్యులకు చెబుతాడనే భయంతో మహిళ, ఆమెతో సంబంధం ఉన్న యువకుడు కలిసి బాలుడికి కూల్‌డ్రింక్‌లో కలుపు మందు కలిపి తాగించి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భర్తతో విడిపోయిన అపర్ణ అనే మహిళ కల్లూరు మండలం చిన్నకొరుకొండ గ్రామంలోని తన అమ్మమ్మ ఇంట్లో నివాసం ఉంటోంది. అదే గ్రామానికి చెందిన అజయ్ అనే యువకుడితో ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ క్రమంలో వారిద్దరూ కలిసి ఉన్న సమయంలో పదో తరగతి విద్యార్థి జిల్లెళ్ల రవి చూశాడు. ఈ విషయం కుటుంబ సభ్యులకు చెబుతానని వారిని హెచ్చరించాడు.
దీంతో రవిని ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని అపర్ణ, అజయ్ నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో గత నెల 24వ తేదీన రవిని గ్రామ శివారుకు తీసుకెళ్లి, కూల్‌డ్రింక్‌లో కలుపు మందు కలిపి తాగించారు. అనంతరం బాలుడి ఆరోగ్య పరిస్థితి క్రమంగా క్షీణించడంతో నిందితులు భయపడి ఈ విషయాన్ని బయటపెట్టారు.
దీంతో కుటుంబ సభ్యులు అక్టోబర్ 25వ తేదీన రవిని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందించినప్పటికీ పరిస్థితి విషమించడంతో రవి మృతి చెందాడు.ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి అపర్ణ, అజయ్‌లను అరెస్ట్ చేశారు. అనంతరం వారిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. చిన్నారి ప్రాణాన్ని బలిగొన్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
