చేప పిల్లల విడుదలకు పక్కా కార్యాచరణ : ఇన్చార్జ్ కలెక్టర్ డాక్టర్ శ్రీజ

చేప పిల్లల విడుదలకు పక్కా కార్యాచరణ : ఇన్చార్జ్ కలెక్టర్ డాక్టర్ శ్రీజ
  • ఖమ్మం ఇన్​చార్జ్ కలెక్టర్ డాక్టర్ శ్రీజ

ఖమ్మం టౌన్, వెలుగు :  నీటి వనరుల్లో చేప పిల్లల విడుదలకు పక్కా కార్యాచరణ అమలు చేయాలని ఖమ్మం ఇన్​చార్జ్ కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ జిల్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లో మంగళవారం చేప పిల్లల పంపిణీపై మత్స్యశాఖ ఆధ్వర్యంలో సంబంధిత మండల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ  చేప పిల్లల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం నిర్ధేశించిన మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలన్నారు. 

జిల్లాలో ఉన్న 882 చెరువుల్లో ఉచితంగా చేప పిల్లలను వదలనున్నట్టు చెప్పారు. కాలుష్యం అధికంగా ఉన్నా, వరద అధికంగా వస్తూ ఓవర్ ఫ్లో అవుతున్నా ఆ  నీటి వనరుల్లో ఇప్పుడు చేప పిల్లలను విడుదల చేయొద్దని సూచించారు. ఎంపీడీఓ, ఇరిగేషన్ ఏఈ, మండల వ్యవసాయ అధికారి, ఫిషరిస్ కో ఆపరేటివ్,  ఆపరేటివ్ సోసైటీ అధ్యక్షుడు, మత్స్యకార సంఘాల సభ్యులతో మండల స్థాయి కమిటీలు, పంచాయతీ కార్యదర్శి, ఏఈఓ, ఫిషరీస్ కో ఆపరేటివ్ సభ్యులతో గ్రామ కమిటీలను గురువారం నాటికి ఏర్పాటు చేయాలని ఆదేశించారు.  నీటి వనరుల్లో నిర్ధిష్ట సంఖ్య, సైజ్ లో చేప పిల్లలు విడుదల చేసేలా పటిష్ట కార్యాచరణ అమలు చేయాలన్నారు. 

   35ఎంఎం నుంచి 40 ఎంఎం చేప పిల్లల ప్యాకెట్స్ మండలానికి వస్తాయని చెప్పారు. ప్యాకెట్ లో ఆక్సిజన్ సరిగ్గా ఉండేలా చూడాలన్నారు.  చేపలు విడుదల చేసే సమయంలో కమిటీ సభ్యులు,  మత్స్యకారులు అందుబాటులో ఉండాలని చెప్పారు.  మత్స్యకార కో ఆపరేటివ్ సొసైటీ సభ్యులతో చర్చించి 15 రోజుల్లో చేప పిల్లల విడుదల పూర్తయ్యేలా చూడాలన్నారు. ఈ సమావేశంలో  జిల్లా మత్స్యశాఖ అధికారి శివ ప్రసాద్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి డి. పుల్లయ్య, జిల్లా పంచాయతీ అధికారి ఆశాలత,  వ్యవసాయ శాఖ ఏడీఏలు, నీటి పారుదల శాఖ అధికారులు, ఎంపీడీఓలు, మత్స్య శాఖ ఫీల్డ్ అసిస్టెంట్లు, తదితరులు పాల్గొన్నారు. 

వంద శాతం ఉత్తీర్ణత లక్ష్యంగా పనిచేయాలి

జిల్లాలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులు రాబోయే 10వ తరగతి, ఇంటర్ పరీక్షలలో వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా పని చేయాలని ఇన్​చార్జ్ కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ సూచించారు.  కలెక్టరేట్ మీటింగ్ హాల్ లో జిల్లాలోని ప్రభుత్వ విద్యాసంస్థల పనితీరుపై సంబంధిత శాఖల అధికారులు, కేజీబీవీ, ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్స్, కాంప్లెక్ హెడ్ మాస్టర్లు, ఎంఈఓలతో ఆమె సమీక్షించారు. రాబోయే పబ్లిక్ పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలన్నారు.

విద్యార్థుల తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు వారానికి రెండుసార్లు ఫోన్ చేసి పిల్లల చదువుపై ఫాలో అప్ చేయాలని సూచించారు.  ప్రతీ విద్యార్థికి అపార్ నెంబర్ ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. అనంతరం హైస్కూల్ హెడ్ మాస్టర్ల హ్యాండ్ బుక్ ను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో జిల్లా ఇంటర్మీడియట్ అధికారి రవిబాబు, గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకులు విజయలక్ష్మి, మండల విద్యాశాఖ అధికారులు  పాల్గొన్నారు.