- ఖమ్మంలోని 9వ డివిజన్ లో సీసీ డ్రైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన
ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం నగరాన్ని కొత్తగా చూసిన వారు చాలా మార్పు వచ్చినట్లు గమనిస్తున్నారని, పారిశుధ్యం విషయంలో చాలా మార్పు వచ్చిందని, నగరంలోని పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శనివారం ఖమ్మంలోని 9వ డివిజన్ రోటరీనగర్ లో రూ.35 లక్షలతో 400 మీటర్ల మేర నిర్మించనున్న సీసీ డ్రైన్ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కార్పొరేషన్ పరిధిలో పెండింగ్ ఉన్న అభివృద్ధి పనులను మరో 4 నెలల్లో పూర్తి చేయించాలని కార్పొరేటర్లకు సూచించారు.
ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని రాజకీయాలకతీతంగా అభివృద్ధి పనులను చేస్తున్నామన్నారు. టీడీఆర్ విధానం ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో కూడా అమలు చేసేందుకు కార్యాచరణ చేపట్టామని తెలిపారు. రోడ్డు విస్తరణ వల్ల వ్యాపారాలు పెరుగుతాయని, ప్రజలను ఒప్పించి రోడ్డు విస్తరణ పనులు చేయాలని చెప్పారు. సైడ్ డ్రైయిన్స్ మీద ఫుట్ పాత్ పనులు పూర్తి చేసి లైటింగ్ ఏర్పాటు చేయాలన్నారు. రోప్ వే, వెలుగు మట్ల అర్బన్ పార్క్ అభివృద్ధి పనులు స్పీడప్ చేయాలని అధికారులను ఆదేశించారు. లకారం నిర్వహణలో లోపాలు ఉన్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయని, వీటిని పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య మాట్లాడుతూ రూ.35 లక్షలతో సీసీ డ్రైయిన్ నిర్మాణ పనులు చేపట్టామని, వీటితో పాటు అవసరమైన పనులు మంజూరు చేసినట్లు తెలిపారు.
9వ డివిజన్ లో విద్యుత్ స్తంభాల తరలింపు కోసం ఎన్పీడీసీఎల్కు చెల్లింపులు పూర్తి చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ చైర్మన్ హన్మంత రావు, మున్సిపల్ ఇంజినీర్లు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధికి కృషి చేశా
భద్రాద్రి కొత్తగూడెం/అశ్వారావుపేట : అగ్రికల్చర్, ఇరిగేషన్, ఇండస్ట్రీ, టూరిజం రంగాలతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రోడ్ల అభివృద్ధికి కృషి చేశానని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. అశ్వారావుపేటలోని తన వ్యవసాయ క్షేత్రంలో శనివారం మీడియాతో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో భద్రాద్రి సీతారామచంద్ర స్వామి టెంపుల్ అభివృద్ధికి నోచు కోలేదన్నారు. సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వంలో భద్రాద్రి టెంపుల్ పునరుద్ధరణతో పాటు విస్తరణ పనులు జరగుతున్నాయని తెలిపారు. రేవంత్పాలనలో ముందు తరాలకు తెలిసేలా సీతారామ ప్రాజెక్టు, భద్రాద్రి రామాలయం, ఎర్త్ సైన్సెస్ యూనివర్శిటీ ఏర్పాటు చిరస్థాయిగా నిలుస్తాయన్నారు. సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని సూచించారు. తెలంగాణలో పది లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్సాగు విస్తరణ లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు.
