నన్ను మానసికంగా వేధిస్తున్నరు : ఎమ్మెల్యే రేఖా నాయక్

నన్ను మానసికంగా వేధిస్తున్నరు : ఎమ్మెల్యే రేఖా నాయక్

ఖానాపూర్, వెలుగు:  బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్సీలు కలిసి తనను మానసికంగా వేధిస్తున్నారని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ ఆరోపించారు. తన పీఏను కూడా తొలగించేందుకు కలెక్టర్ పై ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు. గురువారం ఆమె ఖానాపూర్ లోని తన ఇంట్లో మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం కేటాయించే ఏసీడీపీ నిధులను కొందరు కావాలనే అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.

పలు బ్రిడ్జి పనులతో పాటు వివిధ అభివృద్ధి పనుల విషయాల్లో జాన్సన్ ​నాయక్, ఎమ్మెల్సీ దండె విఠల్ పథకం ప్రకారం తనను అప్రతిష్టపాలు చేసే ప్రయత్నించారని ఫైర్ అయ్యారు. వీరిద్దరి నిర్వాకం వల్లే డబుల్ బెడ్రూమ్ ఇండ్ల ప్రారంభానికి మంత్రి కేటీఆర్  రాలేకపోయారని వెల్లడించారు. నిర్మల్ కు చెందిన మంత్రి కూడా తనను నిర్లక్ష్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక గిరిజన మహిళను ఇలా వేధించడం ఏ మేరకు సమంజసమని ప్రశ్నించారు. తాను ప్రజల మధ్యలో ఉండి రెబెల్ గానైనా పోటీ చేస్తానని రేఖా నాయక్ స్పష్టం చేశారు.