- గ్లోబల్ సమిట్ నిర్వహణ, రాష్ట్రానికి భారీ పెట్టుబడులపై హర్షం
- పార్టీ అగ్ర నేతలను ఢిల్లీలో కలిసిన సీఎం రేవంత్
- 13న మెస్సీ ఫుట్‌బాల్ మ్యాచ్‌కు రావాలని ఆహ్వానం
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణపై సీఎం రేవంత్ రెడ్డికి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అభినందనలు తెలియజేశారు. రాష్ట్ర భవిష్యత్ ముఖచిత్రాన్ని డాక్యుమెంట్ ఆవిష్కరించిందని వారు కొనియాడారు.
ఢిల్లీ పర్యటనలో భాగంగా గురువారం ఖర్గే, ప్రియాంక గాంధీని వారి నివాసాల్లో సీఎం రేవంత్‌రెడ్డి కలిశారు. ఈ భేటీలో సీఎం వెంట మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీలు డాక్టర్ మల్లు రవి, రఘువీర్ రెడ్డి, గడ్డం వంశీకృష్ణ, సురేశ్ షెట్కార్, అనిల్ కుమార్, పోరిక బలరాం నాయక్ ఉన్నారు.
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ విజయవంతమైన తీరు, విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణపై చర్చ జరిగింది. సమిట్ వేదికగా రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు రాబట్టేందుకు ఒప్పందాలు చేసుకోవడంపై ఖర్గే, ప్రియాంక గాంధీ ప్రశంసలు తెలియజేశారు. కాగా, ఈ నెల 13న మెస్సీ ఫుట్ బాల్ మ్యాచ్ కు అగ్ర నేతలను ఆహ్వానించినట్లు సీఎం తెలియజేశారు.
సీఎంకు పలు పార్టీల ఎంపీల అభినందనలు
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్‌ను ఘనంగా నిర్వహించడంతో పాటు రాష్ట్రానికి రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు వివిధ సంస్థలు ముందుకు రావడంపై సీఎం రేవంత్ రెడ్డికి పలు పార్టీల ఎంపీలు అభినందనలు తెలిపారు. కాంగ్రెస్ అగ్ర నేతలతో భేటీ అనంతరం మంత్రి వివేక్ వెంకట స్వామితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి పార్లమెంట్‌కు వెళ్లారు.
ఈ సందర్భంగా... పార్లమెంట్‌లో పలు పార్టీ ఎంపీలు కలిసి అభినందనలు చెప్పారు. దాదాపు గంట పాటు పార్లమెంట్ లో సీఎం గడిపారు. పలు పార్టీలకు చెందిన ఎంపీలు సీఎం రేవంత్ రెడ్డిని ఆప్యాయంగా పలుకరించారు. అనంతరం నేరుగా ఎయిర్ పోర్ట్ కు చేరుకొని.. హైదరాబాద్‌కు తిరుగు పయనమయ్యారు.
ప్రణబ్ ముఖర్జీకి సీఎం నివాళులు
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జయంతి సందర్భంగా.. ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి ఆయన చిత్రపటం వద్ద నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీలు డా.మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, గడ్డం వంశీకృష్ణ, అనిల్ కుమార్ యాదవ్, నాయకులు రోహిణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దేశానికి ప్రణబ్ ముఖర్జీ అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు.

