ఫస్ట్ ఫేజ్ లో ఓటింగ్ తీరు చూసి మోదీ భయపడుతున్నరు: ఖర్గే

ఫస్ట్ ఫేజ్ లో ఓటింగ్ తీరు చూసి మోదీ భయపడుతున్నరు: ఖర్గే

తిరువనంతపురం/కలబుర్గి :  ప్రధాని మోదీ ఫ్రస్ట్రేషన్​లో మాట్లాడుతున్నారని కాంగ్రెస్​ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే విమర్శించారు. తొలిదశ లోక్​సభ ఎన్నికల పోలింగ్​ ముగిసిన తర్వాత ఓటర్ల తీరును చూసి ఆయన భయపడుతున్నారని అన్నారు. బుధవారం కేరళలోని తిరువనంతపురం, కర్నాటకలోని కలబుర్గిలో ఆయన కాంగ్రెస్​అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లోక్‌‌సభ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని పూర్తి విశ్వాసం ఉన్నప్పుడు కాంగ్రెస్​ గురించి మోదీ ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్‌‌ గెలిస్తే.. మంగళసూత్రాలు దోచుకుంటారని చేసిన వ్యాఖ్యలపైనా అభ్యంతరం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ 55 ఏండ్లు పాలించిందని, ఇలాంటి ఘటన ఒక్కసారైనా జరిగిందా? అని ప్రశ్నించారు. ఎన్నికల కోసమే, మోదీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. 1962 యుద్ధంలో ఇందిరా గాంధీ తన ఆభరణాలను విరాళంగా ఇచ్చారని, మోతీలాల్ నెహ్రూ, జవహర్‌‌లాల్ నెహ్రూ స్వాతంత్ర్య ఉద్యమం కోసం తమ ఇండ్లను విరాళంగా ఇచ్చారని అన్నారు. కానీ, మోదీ ప్రభుత్వం ఇప్పుడు దశాబ్దాల క్రితంనాటి ప్రభుత్వ సంస్థలను అంబానీ, అదానీలకు అమ్మేశారన్నారు. మోదీ, అమిత్​షా సెల్లర్స్​గా, అంబానీ, అదానీ బయ్యర్స్​గా మారారని విమర్శించారు. తరచూ గాంధీ కుటుంబం దేశాన్ని దోచుకుందని విమర్శిస్తున్న మోదీ.. వాళ్లు దోచుకుంటే ఆ సొమ్మును ప్రధానమంత్రిగా రివకరీ చేయించాలని ఆయన సవాల్​ విసిరారు. మొదటి దశ ఎన్నికలు పూర్తయిన తర్వాత కాంగ్రెస్ భారీ అంచనాలతో ఉందన్నారు. తాను దాదాపు 10, -12 రాష్ట్రాల్లో పర్యటించానని, అక్కడి ఓటర్ల నుంచి తమ పార్టీకి మంచి స్పందన వస్తోందని ఖర్గే చెప్పారు.

ఓటేయకుంటే.. నా అంత్యక్రియలకైనా రండి..

కర్నాటకలోని తన సొంత జిల్లా కలబుర్గిలో నిర్వహించిన  ప్రచార సభలో ఖర్గే భావోద్వేగానికి గురయ్యారు. రాబోయే లోక్​సభ ఎన్నికల్లో కాంగ్రెస్​ పార్టీకి ఓటు వేయడానికి ఇష్టంలేకపోతే.. తాను కలబుర్గి ప్రజల కోసం పని చేశానని భావిస్తే కనీసం తన అంత్యక్రియలకైనా హాజరు కావాలని ఆయన కోరారు. ఈ సారి కలబుర్గి లోక్‌‌సభ స్థానంలో ఖర్గే అల్లుడు రాధాకృష్ణ దొడ్డమాని పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాను చేసిన సేవలను గుర్తించి ఓటేయాలని ఖర్గే కోరారు.