
- బంగారు పూత పూసిన 900 గ్రాముల వెండి ఆభరణాలు స్వాధీనం
- 12 రోజుల్లో సిటీలోని పలు దుకాణాల వద్ద రెక్కీ
- హైదరాబాద్‌కు దూరంగా, హైవేపై ఉండటంతో చందానగర్ ఖజానా జ్యువెలరీలో చోరీ
- మిగిలిన వారి కోసం గాలిస్తున్న ప్రత్యేక బృందాలు
- నిందితులంతా బిహార్‌కు చెందిన వారుగా పోలీసుల గుర్తింపు
గచ్చిబౌలి, వెలుగు: చందానగర్ ఖజానా జ్యువెలరీ దోపిడీ దొంగలు దొరికారు. ముఠాలోని ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి బంగారు పూత పూసిన 900 గ్రాముల వెండి అభరణాలను స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన ఐదుగురి కోసం గాలిస్తున్నారు. శనివారం గచ్చిబౌలిలోని మాదాపూర్ జోన్ అఫీసులో డీసీపీ జి.వినీత్ కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. బిహార్ సరణ్ జిల్లాకు చెందిన దీపక్ కుమార్ సా(22) రెండేండ్ల కింద హైదరాబాద్‌కు వచ్చి జగద్గిరిగుట్ట ఆస్‌బెస్టాస్ కాలనీలో ఉంటూ, స్థానికంగా ఓ పరిశ్రమలో వెల్డింగ్ వర్క్ చేస్తున్నాడు. అదే జిల్లాకు చెందిన ఆశిష్‌కుమార్ సింగ్(22) నానక్‌రాంగూడలో ఉంటూ లేబర్ పనులు చేస్తుంటాడు. అదే ప్రాంతానికి చెందిన మరో ఐదుగురు జులై 25న బిహార్ నుంచి హైదరాబాద్ వచ్చారు.
వీరంతా కలిసి జ్యువెలరీ షాప్‌లో బంగారం దొంగలించాలని ప్లాన్ చేశారు. జులై 31న జగద్గిరిగుట్టలో ఉన్న ఏ1 మోటార్స్‌లో ఒక గ్లామర్, మరో పల్సర్ బైకును అద్దెకు తీసుకున్నారు. అనంతరం 12 రోజుల పాటు బైక్‌లపై సిటీలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న జ్యువెలరీ షాప్‌ల వద్ద రెక్కీ నిర్వహించారు. తర్వాత దొంగతనానికి అనువుగా ఉన్న మూడు బంగారు దుకాణాలను ఎంచుకున్నారు. అందులో నేషనల్ హైవేపై చందానగర్‌లోని గంగారంలో ఉన్న ఖజానా జ్యువెలరీ షాప్‌లో దోపిడీ చేయాలని డిసైడ్ అయ్యారు. సెక్యూరిటీ తక్కువగా ఉండడం, సిటీ శివారులో షాపు ఉండడంతో దొంగతనం చేశాక పారిపోవడానికి అనువుగా ఉంటుందని భావించారు.
12 ప్రత్యేక బృందాలతో సెర్చింగ్..
జ్యువెలరీ షాప్ అసిస్టెంట్ మేనేజర్ రాంకిరణ్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు ఫైల్ చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దొంగలను పట్టుకునేందుకు సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి 12 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అనంతరం దోపిడీలో పాల్గొన్న ఆశిశ్ కుమార్‌ను మహరాష్ట్ర పుణెలో అదుపులోకి తీసుకున్నారు. అతను ఇచ్చిన సమాచారంతో దీపక్ కుమార్ సాను అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 900 గ్రాముల వెండి అభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ముఠాలోని మిగిలిన ఐదుగురి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. వీరికి లీడర్‌గా వ్యవహరించిన వ్యక్తిపై మర్డర్, దొంగతనం, దోపిడీ తదితర పది కేసులు ఉన్నట్లు డీసీపీ తెలిపారు.
వీరందరూ మహరాష్ట్ర, రాజస్తాన్, బిహార్, కోల్‌కత్తాలో దొంగతనాలు, దోపిడీలకు పాల్పడ్డట్లు పోలీసులు గుర్తించారు. వీరు బిహార్‌లో గన్స్‌ను కొనుగోలు చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. అరెస్టయిన వారి వద్ద గన్స్ లేవని, మిగతా నిందితుల వద్ద ఉన్నాయని, వారే జ్యువెలరీలోకి చొరబడి దోపిడీ చేశారని పోలీసులు వెల్లడించారు. దోపిడీ తర్వాత బైకులపై కొంతదూరం వెళ్లి, అక్కడి నుంచి బస్సుల్లో, ట్రైన్స్‌లో పారిపోయారని తెలిపారు. ఈ సమావేశంలో ఎస్‌వోటీ డీసీపీ శోభన్ బాబు, ఈవోడబ్ల్యూ డీసీపీ ముత్యంరెడ్డి, సీసీఎస్ ఏడీసీపీ రామ్ కుమార్, మియాపూర్ డీసీపీ శ్రీనివాస్, చందానగర్ పోలీసులు పాల్గొన్నారు.
10 నిమిషాల్లో దోచుకొని పరార్..
ఈ నెల 12న ఉదయం దీపక్‌తో పాటు మరో ఐదుగురు రెండు బైకుల్లో చందానగర్ ఖజానా జ్యువెలరీ షాపు వద్దకు చేరుకున్నారు. 10.35 గంటలకు ఒకరి తర్వాత ఒకరు జ్యువెలరీ షాప్‌లోకి ఎంటర్ అయ్యారు. ఓ దుండగుడు తన వద్ద ఉన్న తుపాకీతో షాప్‌లోని వ్యక్తికి గురిపెట్టి లోపలికి వెళ్లాలని సూచించాడు. బంగారు అభరణాలు ఉన్న లాకర్ కీ ఇవ్వాలంటూ షాప్ డిప్యూటీ మేనేజర్ సతీశ్ కుమార్‌ను బెదిరించి, గన్‌తో అతని కాలులో షూట్ చేశాడు. తర్వాత డిస్ ప్లేలో ఉన్న బంగారు పూత ఉన్న 10 కేజీల వెండి అభరణాలు, వస్తువులను బ్యాగుల్లో నింపుకొని అక్కడి నుంచి పరారయ్యారు. పది నిమిషాల్లో చోరీ చేసి బైకులపై చందానగర్ నుంచి బీహెచ్‌ఈఎల్ మీదుగా పటాన్‌చెరు వైపు పారిపోయారు.