
- ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తాకు తాజాగా డీఈవో బాధ్యతలు
- ఇప్పటికే మున్సిపల్ ప్రత్యేక అధికారిగా, పీవో, అడిషనల్ కలెక్టర్‌గా విధులు
- విద్యాశాఖను గాడిన పెట్టేందుకు మొదటిసారి ఐఏఎస్‌కు పగ్గాలు
ఆదిలాబాద్, వెలుగు: అదిలాబాద్ జిల్లాలో కీలక శాఖల్లో ఇప్పుడు ఒక్కరే బాధ్యతలు నిర్వహించనున్నారు. ఉట్నూర్ ఐటీడీఏ పీవోగా విధులు నిర్వహిస్తున్న ఖుష్బూ గుప్తాకు ప్రభుత్వం జిల్లా విద్యాశాఖ అధికారిగా పూర్తి బాధ్యతల అప్పగిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇప్పటికే ఆమె ఆదిలాబాద్ మున్సిపల్ ప్రత్యేక అధికారిగా, ఐటీడీఏ పీవోగా, స్థానిక సంస్థల అడిష నల్ కలెక్టర్‌గా కొనసాగుతుండగా తాజాగా.. డీఈవో బాధ్యతలు కూడా కేటాయించడంతో ఇక నుంచి నాలుగు శాఖల బాధ్యతలు నిర్వహించనున్నారు.
సవాల్‌గా మారనున్న అదనపు బాధ్యతలు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉట్నూర్ ఐటీడీఏ 44 ఏజెన్సీ మండలాల్లో 250 గ్రామ పంచాయతీల్లో విస్తరించి ఉంది. ఐటీడీఏల ద్వారా ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధికి కృషి చేస్తోంది. ముఖ్యంగా గిరిజనులకు విద్య, ఆరోగ్యం, ఉపాధి కల్పించడమే కాకుండా.. వారి సంస్కృతీ సంప్రదాయాలు కాపాడుతూ ముందుకెళ్తోంది. జిల్లా యంత్రాంగానికి సమానంగా పలు శాఖలు ఇక్కడ పనిచేస్తాయి. కీలక ఐటీడీఏ పాలనను పర్యవేక్షిస్తున్న అధికారికి ఇప్పుడు నాలుగు శాఖల బాధ్యతలు అప్పగించడంతో పాలనపై ప్రభావం పడే అవకాశం ఉంది.
ప్రస్తుతం పీవోగా కొనసాగుతున్న ఖుష్బూ గుప్తా గిరిజన సంక్షేమ కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేలా చూడటంలో తన మార్క్ చూపిస్తున్నారు. ముఖ్యంగా గిరిజన ఆశ్రమ స్కూళ్లలో స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులపై ప్రత్యేక దృష్టి పెట్టారు. వర్షకాలం నేపథ్యంలో వైద్య సేవల విషయంలోనూ అప్రమత్తంగా ఉన్నారు. నిత్యం వివిధ కార్యక్రమాలతో బీజీగా గడిపే పీవోకు అదనపు బాధ్యతలు అప్పగించడంతో ఆ శాఖల నిర్వహణ పీవోకు సవాల్‌గా మారనుంది.
విద్యాశాఖ గాడిన పడేనా?
డీఈవో బాధ్యతలు గత ఆరేండ్లుగా ఇన్‌చార్జీలతోనే నెట్టుకొస్తున్నారు. రెగ్యులర్ డీఈవో లేకపోవడంతో ఆదిలాబాద్ జిల్లా విద్యాశాఖ గాడిదప్పిందనే ఆరోపణలున్నాయి. ఐదు నెలల క్రితం డీఈవో ప్రణీత రిటైర్ కావడంతో మోడల్ స్కూల్ డిప్యూడీ డైరెక్టర్‌కు ఇన్‌చార్జీగా బాధ్యతలు అప్పగించారు. కానీ ఆయన విధుల్లో చేరకపోవడంతో వయోజన విద్య డీడీగా ఉన్న శ్రీనివాస్ రెడ్డిని డీఈవోగా నియమించారు. కానీ నాలుగు నెలలకే ఆయన స్థానంలో పీవోకు అదనపు బాధ్యతలు అప్పగించారు.
ఒక ఐఏఎస్‌ను జిల్లా విద్యాశాఖ అధికారిగా నియమించడం జిల్లా చరిత్రలోనే ఇదే మొదటి సారి. ఐఏఎస్‌కు డీఈవో బాధ్యతులు అప్పగించడంతో ఆ శాఖలో అక్రమార్కులు, విధుల్లో నిర్లక్ష్యం వహించే టీచర్లలో గుబులు రేపుతోంది. ఖుష్బూ గుప్తా విధుల్లో స్ట్రిక్ట్‌గా ఉంటారనే పేరుంది. తప్పు చేస్తే చర్యలు తీసుకుంటారు. దీంతో నిత్యం అవినీతి, అక్రమాల ఆరోపణలతో వార్తల్లో నిలుస్తున్న విద్యాశాఖ గాడిలో పడే అవకాశం ఉందని చర్చ నడుస్తోంది.