
తమిళనాడు రాజకీయాల్లో కొత్త ఈక్వేషన్స్ తెరపైకి వచ్చే విధంగా వ్యూహాత్మక అడుగులు పడుతున్నాయి. తమిళగ వెట్రీ కజగం పేరుతో పార్టీ పెట్టిన హీరో విజయ్.. రాబోయే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తానంటూ ప్రకటించిన విషయం తెలిసిందే.. ఈ విషయం తెలిసి కూడా.. తమిళనాడు బీజేపీ ఉపాధ్యక్షురాలు.. నటి ఖుష్బూ చేసిన ప్రతిపాదన ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది. హీరో విజయ్ TVK..ఏఐఏడీఎంకే, బీజేపీ కూటమితో కలిసి రావాలని ఖుష్బూ ఓపెన్ స్టేట్ మెంట్ ఇవ్వటం చర్చనీయాంశం అయ్యింది. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరు.. అదే విధంగా మాట అనేది ఎప్పుడైనా మారొచ్చు అనటానికి ఇదో సంకేతమా అంటున్నారు అనలిస్టులు..
తమిళనాడు ప్రస్తుత రాజకీయాలు, పార్టీల పొత్తుల గురించి ఓ న్యూస్ ఛానల్ తో మాట్లాడిన ఖష్బూ.. తమిళగ వెట్రి కజగం (టీవీకే) చీఫ్ విజయ్‌తో తనకు చాలా కాలంగా మంచి రిలేషన్ ఉందన్నారు. విజయ్ ను తాను తమ్ముడిలా భావిస్తానని చెప్పారు. తమిళనాడులో డీఎంకేను ఓడించడమే టార్గెట్ గా విజయ్ విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తున్నారు. అతని టార్గెట్ డీఎంకేను ఓడించడమే అయినపుడు అందరం కలిసి వెళ్తే బాగుంటుంది. బీజేపీ, ఏఐఏడీఎంకేలతో టీవీకే చేతులు కలిపితే అది చాలా తెలివైన నిర్ణయంగా భావిస్తా అని ఖుష్బూ తెలిపారు.
నియోజకవర్గాలలో బూత్ స్థాయి లెవల్లో బీజేపీని బలోపేతం చేయడమే తన లక్ష్యమని అన్నారు ఖుష్బూ. అలాగే దక్షిణ చెన్నైపై ప్రత్యేక దృష్టి సారిస్తామని అన్నారు. అన్నాడీఎంకేతో బీజేపీ పొత్తు గురించి ఖుష్బు మాట్లాడుతూ పార్టీలు ఎల్లప్పుడూ స్నేహపూర్వక సంబంధాలను కొనసాగిస్తున్నాయని అన్నారు. ఎన్నికల్లో పోరాడటానికి అన్నాడీఎంకే లాంటి భాగస్వామి తమతో ఉన్నందుకు సంతోషిస్తున్నామని చెప్పారు. మిగిలిన వాటిపై పార్టీ పెద్దలు, సీనియర్ నాయకులు నిర్ణయం తీసుకుంటారని అన్నారు.
తమిళనాడు బీజేపీ ఉపాధ్యాక్షురాలిగా ఖుష్బూ
ఎన్నికలు సమీపిస్తుండటంతో ఖుష్బూ సుందర్ బీజేపీ తమిళనాడు ఉపాధ్యక్షురాలిగా జులై 30న నియమితులయ్యారు. ఈ నియామకాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆమోదంతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ ప్రకటించారు. ఆమెతో పాటు మరో 13 మంది కూడా రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియమితులయ్యారు.
ఈ సందర్భంగా ఆమె బీజేపీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ నియామకం పట్ల తాను చాలా సంతోషంగా ఉన్నానని, తనపై నమ్మకం ఉంచినందుకు పార్టీ సీనియర్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ లకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు ఖుష్బూ.