బీజేపీలో చేరిన నటి ఖుష్బూ

బీజేపీలో చేరిన నటి ఖుష్బూ

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, నటి ఖుష్బూ బీజేపీలో చేరారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సి.టి.రవి, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు మురుగన్‌‌‌తోపాటు బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా సమక్షంలో ఖుష్బూ పార్టీలో జాయిన్ అయ్యారు. ఆరేళ్ల పాటు కాంగ్రెస్‌లో కొనసాగిన ఖుష్బూ పార్టీ నాయకత్వంపై పలు ఆరోపణలు చేస్తూ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. మోడీ నేతృత్వంలోని బీజేపీలో చేరడం ఆనందంగా ఉందని ఖుష్బూ అన్నారు.

‘దేశాన్ని సరైన దారిలో ముందుకు తీసుకెళ్లడానికి ప్రధాని మోడీ లాంటి నాయకుడి అవసరం ఉందని గ్రహించా. కాంగ్రెస్‌‌లో ఉన్నప్పుడు కొన్నిసార్లు అకారణంగా బీజేపీ విధానాలను వ్యతిరేకించాం. అక్కడ నా సేవలను అంతగా వినియోగించుకోవడం లేదని అనిపించింది. బీజేపీలో ఏ బాధ్యతలు అప్పగించినా కష్టపడి పని చేస్తా. ప్రధాని మోడీ దేశాన్ని సరైన మార్గంలో ముందుకు తీసుకెళ్తున్నారు. తమిళనాడులో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం కోసం శ్రమిస్తా. రాష్ట్రంలో బీజేపీ విజయం సాధిస్తుంది. కాంగ్రెస్ పార్టీని ఎందుకు వీడానో సోనియా గాంధీకి రాసిన రాజీనామా లేఖలో చెప్పా. కాంగ్రెస్ అక్కడ ఏ రోజూ విజయం కోసం పని చేయలేదు. నేను టికెట్ కోసం ఎప్పుడూ అడగలేదు. ఆ పార్టీని వీడటానికి అది కారణం కాదు. కాంగ్రెస్ నేతలకు నాతో ఈగో సమస్యలు ఉన్నాయనుకుంటున్నా. బీజేపీలో నాకు ఎలాంటి బాధ్యతలు ఇవ్వాలనేది పార్టీ నాయకత్వం నిర్ణయిస్తుంది’ అని ఖుష్బూ చెప్పారు.