ఖుషిలో సెన్సిటివ్‌‌ ఇష్యూని చూపించా

ఖుషిలో సెన్సిటివ్‌‌ ఇష్యూని చూపించా

నిన్ను కోరి, మజిలీ లాంటి ప్రేమకథా చిత్రాలతో దర్శకుడిగా మెప్పించిన శివ నిర్వాణ.. విజయ్ దేవరకొండ, సమంత జంటగా ‘ఖుషి’ చిత్రాన్ని తెరకెక్కించాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ పాన్‌‌ ఇండియా మూవీ సెప్టెంబర్ 1న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా శివ నిర్వాణ సినిమా విశేషాలను గురించి ఇలా వివరించాడు.

‘‘నా గత చిత్రాల్లో ఫెయిల్యూర్ లవ్ స్టోరీస్ చూపించాను. ఈసారి ఒక ఎనర్జిటిక్ అండ్ ఎంటర్‌‌‌‌టైనింగ్‌‌గా సాగే సరదా ప్రేమకథను చూపించబోతున్నా. మొదట్లో ‘సరదా’ లాంటి టైటిల్స్‌‌ అనుకున్నా, పాన్‌‌ ఇండియా సినిమా కనుక అన్ని భాషలకు కలిసొచ్చేలా ‘ఖుషి’ టైటిల్‌‌ను ఫైనల్ చేశాం. పెళ్లికి ముందు ప్రేమ, పెళ్లి తర్వాత సమస్యలు అనే కాన్సెప్ట్‌‌తో ‘సఖి’ లాంటి చిత్రాలు చాలా వచ్చాయి. కానీ ఇందులో ఓ యూనిక్ పాయింట్ ఉంటుంది. ప్రస్తుత సమాజంలో ఉన్న ఒక సెన్సిటివ్‌ ఇష్యూను చర్చించాం. అదికూడా విజయ్, సమంత లాంటి  పాపులర్ స్టార్స్‌‌ ద్వారా చెప్తే బాగుంటుందని నమ్మాం. వాళ్లకూ ఈ పాయింట్ కనెక్ట్ అయ్యింది. అదేమిటనేది థియేటర్‌‌‌‌లోనే చూడాలి. ‘ఖుషి’ టైటిల్‌‌కు తగ్గట్టుగా ఈ కథను ఎంటర్‌‌‌‌టైనింగ్‌‌గా చెప్పాం. దాంతో పాటు హార్ట్ టచింగ్ సీన్స్‌‌ ఉంటాయి. ప్రేమ కథను కొత్తగా చెప్పడం కోసమే కాశ్మీర్ బ్యాక్‌‌డ్రాప్. విజయ్‌‌లో మంచి కామెడీ టైమింగ్ ఉంటుంది. 

ఇందులో స్టైలిష్ కామెడీ చేశాడు. అమ్మాయిలకు, ఫ్యామిలీ ఆడియెన్స్‌‌కు తన పాత్ర బాగా నచ్చుతుంది. ఇందులో వింటేజ్ సమంతను చూస్తారు. ‘ఫ్యామిలీ మ్యాన్’ లాంటి డిఫరెంట్ జానర్స్‌‌లో నటిస్తున్న సమంత, లవ్‌‌స్టోరీలో నటించి చాలా కాలమైంది. మళ్లీ ఓ ప్రేమకథలో ఆమెను చూడటం మంచి ఫీల్ కలిగిస్తుంది. ఈ సినిమా కథకు సమంత రియల్‌‌ లైఫ్‌‌కు ఎలాంటి పోలికలు లేవు. మూడేళ్ల క్రితమే ఈ కథ రాశా. థియేటర్‌‌‌‌లో ఈ మూవీ చూసి ఒక మంచి ఫీల్‌‌తో బయటకు వస్తారు. హేషమ్ సూపర్బ్ మ్యూజిక్ ఇచ్చాడు. పాటలన్నీ హిట్. మ్యూజిక్‌‌కు మంచి పేరొచ్చింది కనుక మ్యూజిక్‌‌ కన్సర్ట్‌‌తో ప్రమోషన్ చేశాం. అది విజయ్ చెప్పిన ఆలోచనే. నేను మణిరత్నం గారి అభిమానిని. ఆయన సినిమాలను ఇష్టపడతాను కానీ ఆయనలా తీయాలనుకోను. ఆయన చిత్రాల్లోని ఈస్థటిక్ సెన్స్, మ్యూజిక్ సెన్స్ నుంచి స్ఫూర్తి పొందుతాను. మనకు నచ్చే మన నేటివిటీ ఉన్న సినిమాను బాగా తీస్తే అది ఇతరులకు  నచ్చి పాన్ ఇండియా మూవీ అవుతుంది. అంతే తప్ప ముందే ప్లాన్‌‌ చేసుకోనవసరం లేదనేది నా అభిప్రాయం.