ధర్మపురిలో విషాదం: అంగన్వాడీలో టాబ్లెట్ వికటించి చిన్నారి మృతి

ధర్మపురిలో విషాదం: అంగన్వాడీలో టాబ్లెట్ వికటించి చిన్నారి మృతి

జగిత్యాల జిల్లా ధర్మపురిలో విషాదం జరిగింది. అంగన్వాడీ కేంద్రంలో నులిపురుగు నివారణ టాబ్లెట్లు వేసుకున్నాక కాసేపటికే.. ఫిట్స్ వచ్చి ఓ చిన్నారి చనిపోయింది. సోమవారం ఉదయం ధర్మపురిలో పిల్లలకు నులిపురుగు నివారణ టాబ్లెట్లు వేశారు. ధర్మపురిలోని ఓ ప్రైవేటు స్కూల్‌లో చదువుతున్న సహస్ర అనే ఏడేళ్ల పాపకు ఆశా వర్కర్ ఈ టాబ్లెట్ ఇవ్వడంతో వాటిని చిన్నారికి వేశారు. ఆ తర్వాత కాసేపటికే పాపకు వాంతులవడం, ఫిట్స్ రావడంతో ధర్మపురిలో ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు తల్లిదండ్రులు. అయితే పరిస్థితి విషమంగా ఉండడంతో జగిత్యాల తీసుకెళ్లాలని డాక్టర్లు చెప్పారు. అక్కడికి వెళ్లేసరికే పాప చనిపోయిందని వైద్యులు నిర్ధారించినట్లు చెప్పారు చిన్నారి కుటుంబసభ్యులు. తమ బిడ్డ ప్రాణాలు తీశారంటూ సహస్ర తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ఉదయం వరకు బాగానే ఉన్న చిన్నారి ఒక్కసారిగా ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబమంతా విషాదంలో మునిగిపోయింది. ఆరోగ్య శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ మరణించిందని ఆరోపిస్తున్నారు తల్లిదండ్రులు.

ధర్మపురిలో నులిపురుగు నివారణ టాబ్లెట్లు వేసుకున్న 10 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. వీరిని ధర్మపురి ప్రభుత్వాసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. అయితే సహస్ర మృతికి కారణాలను ఇప్పుడే చెప్పలేమని డాక్టర్లు అంటున్నారు. ఆ చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపామని, రిపోర్ట్ వస్తేగానీ క్లారిటీ ఇవ్వలేమని చెబుతున్నారు. సాధారణం ఈ టాబ్లెట్లు పడకపోతే వాంతులు, కడుపులో నొప్పి వస్తాయన్ని చెప్పారు. అయితే దీర్ఘకాలంగా ఫిట్స్ లాంటి అనారోగ్య సమస్యలు ఉన్నవారికి నులిపురుగు నివారణ గోలీలు ఇవ్వకూడదని, సహస్రకు అలాంటివేమీ లేవని ఆ చిన్నారి తల్లిదండ్రులు చెబుతున్నట్లు డాక్టర్లు తెలిపారు.