తమిళనాడులో బోరుబావిలో పడిన చిన్నారి సుజీత్ కథ విషాదంతమైంది. బోరుబావిలోనే చిన్నారి సుజీత్ మృతి చెందాడు. బాలుడి శవాన్ని బయటకు తీసిన అధికారులు ఆస్పత్రికి తరలించారు. చిన్నారిని రక్షించేందుకు చాలా కృషి చేశామన్నారు అధికారులు. ఈ నెల 25న ఇంటి సమీపంలో ఆడుకుంటున్న సుజీత్ ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయాడు. దీంతో బాలుడిని రక్షించేందుకు నాలుగు రోజులపాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు పోలీసు, ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించాయి. బోరుబావికి సమాంతరంగా గోతిని తవ్విన అధికారులు…. 88 అడుగుల లోతులో చిక్కుకున్న చిన్నారి మృతదేహాన్ని బయటకు తీశారు.
సుజిత్ విల్సన్ మృతదేహానికి తిరుచిరాపల్లి జిల్లాలోని మనప్పరి గవర్నమెంట్ హాస్పిటల్ లో పోస్ట్ మార్టం చేశారు. తర్వాత అతడి మృతదేహాన్ని సొంతూరు పూడూరుకు తరలించారు. సుజిత్ ను చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భారీగా జనం వచ్చారు. తల్లిదండ్రులు, బంధువుల ఆక్రందనలతో ఆ ప్రాంతమంతా విషాదం అలుముకుంది.

