ప్రేమించాలంటూ యువకుడి కిడ్నాప్..నిందితురాలు ఐదు స్టార్టప్ కంపెనీలకు ఎండీ

ప్రేమించాలంటూ యువకుడి కిడ్నాప్..నిందితురాలు ఐదు స్టార్టప్ కంపెనీలకు ఎండీ
  • టీవీ యాంకర్ ఫొటోతో మ్యాట్రిమోనిలో ఫేక్ ప్రొఫైల్ పెట్టిన సైబర్ నేరగాళ్లు   
  • అది నిజమేనని నమ్మి రూ.40 లక్షలు మోసపోయిన యువతి
  • పెండ్లి చేసుకోవాలంటూ యాంకర్ వెంటపడి సతాయింపు
  • చివరికి కిడ్నాప్ చేయించి పోలీసులకు చిక్కి జైలుపాలు 

హైదరాబాద్, వెలుగు: ఐదు స్టార్టప్‌ కంపెనీలకు ఎండీ అయిన యువతి.. మ్యాట్రిమోనీలో ఓ ఫేక్ ప్రొఫైల్ చూసి అతనిపై మనసు పడింది. ఓ టీవీ యాంకర్ ఫొటోతో సైబర్ నేరగాళ్లు ఆ ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేయగా, వాళ్ల వలలో చిక్కి రూ.40 లక్షలు పోగొట్టుకుంది. తర్వాత మోసపోయానని తెలుసుకుని, ఆ టీవీ యాంకర్ ను కలిసి జరిగిందంతా చెప్పింది.

ఈ క్రమంలో అతనితో టచ్ లోకి వెళ్లి తాను ఇష్టపడ్డానని తనను ప్రేమించాలని, పెండ్లి చేసుకోవాలని వెంటపడ్డది. ఆ యువకుడు కాదనడంతో చివరకు కిడ్నాప్ చేయించింది. రూమ్‌లో బంధించి చిత్రహింసలకు గురిచేసింది. అక్కడి నుంచి తప్పించుకున్న బాధితుడు.. పోలీసులను ఆశ్రయించగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ కిడ్నాప్ ఈ నెల 11న హైదరాబాద్ ఉప్పల్ లోని భరత్ నగర్ లో జరిగింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. యువతి, ఆమె సంస్థలో పని చేస్తున్న ఉద్యోగిని అరెస్టు చేశారు. మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు. ఈ కేసు వివరాలను మల్కాజిగిరి ఏసీపీ పురుషోత్తం రెడ్డి శుక్రవారం మీడియాకు వెల్లడించారు. 

సైబర్ నేరగాళ్ల వలలో చిక్కి..  

మాదాపూర్‌‌ లోని ఫ్రెష్‌ లివింగ్‌ అపార్ట్ మెంట్​లో ఉండే భోగిరెడ్డి త్రిష్ణ డిజిటల్ మార్కెటింగ్ బిజినెస్ చేస్తున్నది. ఇందులో భాగంగా ఐదు స్టార్టప్‌ కంపెనీలను ప్రారంభించింది. వాటికి ఆమెనే మేనేజింగ్ డైరెక్టర్‌‌గా ఉన్నది. రెండేండ్ల కింద భారత్‌‌ మ్యాట్రిమోనీలో చైతన్యరెడ్డి పేరుతో ఉన్న ప్రొఫైల్ ను త్రిష్ణ చూసింది. ఆ ప్రొఫైల్ ఫొటో ఓ ఎంటర్‌‌టైన్‌మెంట్‌ చానల్‌లో యాంకర్‌‌గా పని చేస్తున్న ‌ప్రణవ్‌ సిస్ట్లది కావడంతో అతనే చైతన్యరెడ్డి అని భావించింది.

అతనితో వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో చాటింగ్‌ చేసింది. ఈ క్రమంలో చైతన్యరెడ్డి తన బిజినెస్‌లో ఇన్వెస్ట్​మెంట్‌ కోసం డబ్బులు ఇవ్వాలని కోరాడు. తిరిగి ఇస్తానని నమ్మించాడు. దీంతో త్రిష్ణ ఫోన్‌ పే ద్వారా విడతల వారీగా రూ.40 లక్షలు ట్రాన్స్​ఫర్ చేసింది. కొన్ని రోజుల తర్వాత తన డబ్బులు తిరిగి ఇవ్వాలని కాల్స్ చేయడం ప్రారంభించింది. అయితే చైతన్యరెడ్డి పేరుతో ఉన్న సైబర్ నేరగాడు.. త్రిష్ణ కాల్స్​కి ఆన్సర్ చేయడం మానేశాడు.

దీంతో మోసపోయానని గుర్తించిన త్రిష్ణ.. ప్రొఫైల్‌ ఫొటో ఆధారంగా సోషల్‌ మీడియాలో సెర్చ్‌ చేసింది. యాంకర్‌‌ ప్రణవ్‌ ఫోన్ నంబర్ సంపాదించింది. మ్యాట్రిమొనీలో ఫేక్‌ ప్రొఫైల్‌ క్రియేట్‌ చేశారని ప్రణవ్‌తో చెప్పింది. త్రిష్ణ ఇచ్చిన సమాచారంతో ప్రణవ్ అప్రమత్తమయ్యాడు. తన ఫొటోతో ఫేక్ ప్రొఫైల్ క్రియేట్‌ చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

నంబర్ బ్లాక్ చేశాడని కక్ష పెంచుకుని.. 

మ్యాట్రిమోనీలో ప్రణవ్ ఫొటో చూసి ఇష్టపడిన త్రిష్ణ.. ఫేక్ ప్రొఫైల్ విషయం చెప్పి, అతనితో పరిచయం పెంచుకుంది. రెగ్యులర్‌‌గా కాల్స్‌ చేస్తుండేది. ఈ క్రమంలో తనతో కాల్స్‌ మాట్లాడాలని, ప్రేమించాలని, పెండ్లి చేసుకోవాలని వెంటబడింది. దీంతో త్రిష్ణ నంబర్‌‌ను ప్రణవ్ బ్లాక్ చేశాడు. ఇలా చేయడంతో ప్రణవ్‌పై త్రిష్ణ కక్ష పెంచుకుంది. తన ఆఫీసులో పని చేసే ఉద్యోగితో కలిసి కిడ్నాప్ కు ప్లాన్ చేసింది. రూ.50 వేలకు మరో ముగ్గురితో డీల్ మాట్లాడుకుంది. ఆ గ్యాంగ్ ఈ నెల11న అర్ధరాత్రి 1:25 గంటల సమయంలో ప్రణవ్‌ను ఉప్పల్‌లో కిడ్నాప్‌ చేసింది.

అతణ్ని మాదాపూర్‌‌లోని త్రిష్ణ ఆఫీస్‌లో బంధించి దాడి చేశారు. దీంతో ఆమెతో మాట్లాడుతానని ప్రణవ్‌ ఒప్పుకున్నాడు. కాల్స్ చేస్తే ఆన్సర్ చేస్తానని చెప్పాడు. మరుసటి రోజు ఉదయం వారి వద్ద నుంచి బయటపడ్డాడు. ఉప్పల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు త్రిష్ణ నంబర్ ఆధారంగా దర్యాప్తు చేశారు. త్రిష్ణను, ఆమె సంస్థకు చెందిన ఉద్యోగిని శుక్రవారం అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు.