తీపి కబురు.. ఆరోగ్య శ్రీ ప‌రిధిలోకి కిడ్నీ, హార్ట్, లివ‌ర్ ట్రాన్స్‌ప్లాంటేష‌న్

తీపి కబురు.. ఆరోగ్య శ్రీ ప‌రిధిలోకి కిడ్నీ, హార్ట్, లివ‌ర్ ట్రాన్స్‌ప్లాంటేష‌న్

ఆరోగ్య శ్రీ ప‌రిధిలోకి కిడ్నీ, హార్ట్, లివ‌ర్ ట్రాన్స్‌ప్లాంటేష‌న్‌ను తీసుకురావాల‌ని మంత్రివ‌ర్గ ఉప‌సంఘం నిర్ణ‌యం తీసుకుంద‌ని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ తెలిపారు.న‌గ‌రంలోని మ‌ర్రి చెన్నారెడ్డి మాన‌వ వ‌న‌రుల కేంద్రంలో వైద్యారోగ్య శాఖ బ‌లోపేతానికి సీఎం కేసీఆర్ నియ‌మించిన కేబినెట్ స‌బ్ క‌మిటీ భేటీ అయింది. ఈ స‌మావేశంలో మంత్రులు ఈట‌ల రాజేంద‌ర్‌, కేటీఆర్, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌, ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావుతో పాటు సంబంధిత అధికారులు పాల్గొని ప‌లు అంశాల‌పై చ‌ర్చించారు.

ఈ సమావేశంలో మంత్రి ఈట‌ల మాట్లాడుతూ.. కిడ్నీ, హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేష‌న్‌కు రూ. 30 ల‌క్ష‌ల నుంచి రూ. 40 ల‌క్ష‌ల ఖ‌ర్చు అవుతుంద‌ని ఇది పేద‌ల‌కు భారంగా మారింద‌న్నారు. ఈ క్ర‌మంలో ఈ మూడింటిని ఆరోగ్య శ్రీ ప‌రిధిలోకి చేర్చి.. పేద‌ల‌పై రూపాయి భారం ప‌డ‌కుండా ఉచిత వైద్యం అందిస్తామ‌న్నారు. ప్ర‌స్తుతం కేవ‌లం నిమ్స్, గాంధీ, ఉస్మానియా ఆస్ప‌త్రుల్లోనే మూత్ర‌పిండాలు, గుండె, కాలేయ మార్పిడి శ‌స్ర్త‌చికిత్స‌లు కొన‌సాగుతున్నాయ‌ని, వీటిని మెడిక‌ల్ కాలేజీల అనుబంధ ఆస్ప‌త్రుల‌కు విస్త‌రింప‌జేస్తామ‌ని మంత్రి తెలిపారు. ఈ ప్ర‌తిపాద‌న‌కు సంబంధించి అవ‌స‌ర‌మైతే చ‌ట్టంలో కూడా మార్పులు చేస్తామ‌న్నారు. వైద్యారోగ్య శాఖ 365 రోజులు నిరంత‌రం ప‌ని చేస్తుందని పేర్కొన్నారు. వైద్యశాఖ‌ను మ‌రింత బ‌లోపేతం చేయాల్సిన అవ‌స‌రం ఉందని అన్నారు. కొవిడ్ నేప‌థ్యంలో ప్రజ‌లంద‌రూ ఇళ్లకే ప‌రిమితమైతే ఆరోగ్య శాఖ మాత్రం ప్రజా సేవ‌లో నిమ‌గ్నమైందని మంత్రి ఈటల తెలిపారు.

అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణలో క‌రోనా అదుపులోనే ఉందని అన్నారు. క‌రోనా నేప‌థ్యంలో వైద్యారోగ్య శాఖ అద్భుతంగా ప‌ని చేస్తోందని, పంచాయ‌తీరాజ్‌, మున్సిప‌ల్, వైద్య ఆరోగ్య శాఖలు క‌లిసి ప‌నిచేయ‌డం వ‌ల్లే ఈ సారి సీజ‌న‌ల్ వ్యాధులు కూడా బాగా త‌గ్గాయని తెలిపారు. రోగాలు, వ్యాధుల ప‌ట్ల ప్రజ‌ల్లో అవ‌గాహ‌న పెరిగిందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఈ స‌మావేశంలో ప‌లు ప్ర‌తిపాద‌న‌ల‌కు కేబినెట్ స‌బ్ క‌మిటీ ఆమోదం తెలిపింది. ఈ నివేదిక‌ను సీఎం కేసీఆర్‌కు మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ అంద‌జేయ‌నున్నారు.