న్యూయార్క్: ప్రపంచవ్యాప్తంగా సెల్ ఫోన్ లను ఇంతగా వాడతారని అప్పట్లో తాను ఊహించలేదని సెల్ ఫోన్ సృష్టికర్త మార్టిన్ కూపర్ అన్నారు. ప్రస్తుత తరాల వాళ్లు ఫోన్ లను వాడుతున్న తీరు చూసి షాక్ అయ్యానని వెల్లడించారు. మార్టిన్ కూపర్ 1973, ఏప్రిల్ 3న మొట్టమొదటి సారిగా మొబైల్ ఫోన్ లో మాట్లాడటాన్ని సాధ్యం చేసి చూపారు. ‘సెల్ ఫోన్ పితామహుడు’గా చరిత్రలో నిలిచారు. 94 ఏండ్ల కూపర్ ఇటీవల ‘ఏఎఫ్ పీ’ వార్తాసంస్థ ఇంటర్వ్యూలో అనేక విషయాలను పంచుకున్నారు.
మొబైల్ ఫోన్ శక్తి సామర్థ్యాలకు ఆకాశమే హద్దు అని, ఏదో రోజు వ్యాధులను నిర్మూలించేందుకు కూడా ఇది ఉపయోగపడుతుందన్నారు. అయితే, ప్రస్తుతం ఫోన్ ను కొంచెం ఎక్కువగా వాడుతున్నామని ఆయన అభిప్రాయపడ్డారు. ‘‘జనం ఫోన్ లు చూసుకుంటూ రోడ్డును దాటడం చూసి నేను షాక్ అయ్యాను. వాళ్లు పూర్తిగా సెల్ ఫోన్ లలో లీనమవుతున్నారు. కానీ కొందరు ఇలా రోడ్డు దాటుతూ కార్ల కింద పడితే.. అప్పుడైనా మిగతా వారు ఈ ప్రమాదాన్ని గుర్తిస్తారు” అని కూపర్ సరదాగా కామెంట్ చేశారు.
లక్షలకొద్దీ యాప్లొచ్చినయ్..
తాను యాపిల్ వాచ్, ఐఫోన్ వాడు తున్నానని, ఈ–మెయిల్ చెక్ చేసుకు నేందుకు, ఫొటోలు, యూట్యూబ్ వీడియో లు చూసేందుకు వాడుతున్నానని మార్టిన్ కూపర్ తెలిపారు. హియరింగ్ ఎయిడ్ ను కంట్రోల్ చేసేందుకూ ఉపయో గిస్తున్నానని తెలిపారు. ప్రస్తుతం లక్షల కొద్దీ యాప్లు వచ్చాయని, సెల్ వాడకంలో తన కంటే తన మనవలు, మనమరాళ్లే బెటర్ అని అన్నారు. ఏదోరోజు సెల్ ఫోన్ లు మన శరీరాల్లో భాగం అవుతాయని, భవిష్యత్తు తరాల వాళ్లు వీటిని మన కంటే బాగా ఉపయోగిం చుకుంటారని అభిప్రాయపడ్డారు.
