తన అందమే ఎర... పెండ్లి కాని అబ్బాయిలపై వల

తన అందమే ఎర... పెండ్లి కాని అబ్బాయిలపై వల
  • తన అందమే ఎర... పెండ్లి కాని అబ్బాయిలపై వల  
  • ఎదురు కట్నం తీసుకుని మరీ పెండ్లిళ్లు 
  • తర్వాత నిందలేసి ఇండ్ల నుంచి పరార్
  • ఇద్దరు కి‘లేడీ’లను అరెస్ట్​ చేసిన చండ్రుగొండ పోలీసులు 

చండ్రుగొండ, వెలుగు : ఆమెకు ఇది వరకే పెండ్లయ్యింది...ఏదో కారణంతో భర్తతో విడిపోయింది...తర్వాత చెడు వ్యసనాలకు బానిసైంది. డబ్బుల కోసం ఏం చేయాలా అని ఆలోచించింది..తన అందాన్నే ఎరగా వేసి చూడడానికి బాగా లేని అబ్బాయిలపై వల వేసేది. పెండ్లి చేసుకోవాలంటే ఎదురుకట్నం ఇవ్వాలంటూ మరో మహిళతో మాట్లాడించేది. అలా డబ్బులు తీసుకుని పెండ్లి చేసుకోకుండా కొందరిని, పెండ్లి చేసుకుని మరికొందరిని మోసం చేసింది. ఇలాంటి ఘటనలపై కంప్లయింట్స్ ​రావడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ పోలీసులు నిఘా పెట్టి ఇద్దరు మహిళలను కటకటాల్లోకి నెట్టారు. 

చండ్రుగొండ ఎస్సై ఎం.రవి కథనం ప్రకారం..ఏపీలోని ఏలూరు జిల్లా పెద్దపాడు మండలం తాళముడికి చెందిన లక్ష్మీశ్రావణికి 2020లో పెండ్లి కాగా కొద్దిరోజులకే భర్తతో విడిపోయి జల్సాలకు అలవాటు పడింది. ఈమెకు ఇదే జిల్లా తిరువూరు మండలం తంగెళ్లబీడుకు చెందిన రేణుకతో పరిచయమైంది. ఈమె మ్యారేజీ బ్యూరోతో పాటు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేది. లక్ష్మీశ్రావణి అందంగా ఉండడంతో ఎరగా వేసి డబ్బులు సంపాదించాలని ఇద్దరూ ప్లాన్ ​వేశారు. దీని కోసం కొన్ని అగ్ర కులాల్లో పెండ్లికాని అబ్బాయిలను సెలెక్ట్​ చేసుకున్నారు. సంబంధాల కోసమని తన దగ్గరకు వచ్చే అబ్బాయిల్లో డబ్బులుండి, అందంగా లేకుండా పెండ్లి కాదేమోనని బాధపడుతుండే వారిని టార్గెట్​చేసేవారు. 

వీరితో రేణుక...లక్ష్మీశ్రావణి అనే అమ్మాయి ఉందని కాకపోతే ఆమెకు ఎవరూ లేని అనాథ అని సింపతీ క్రియేట్​ చేసేది. లక్ష్మీశ్రావణిని అబ్బాయిలకు చూపించాక అందంగా ఉండడంతో కచ్చితంగా ఆమెనే పెండ్లి చేసుకుంటామని పట్టుబట్టేవారు. వారి బలహీనతను ఆసరాగా చేసుకుని ఎదురుకట్నం ఇవ్వాల్సి ఉంటుందని రేణుక కండీషన్ ​పెట్టేది. ఇలా ఇద్దరూ కలిసి ఎన్నో చోట్ల మోసాలకు పాల్పడ్డారు ఖమ్మం జిల్లా కల్లూరులో ఒక యువకుడికి లక్ష్మీశ్రావణిని ఇచ్చి పెండ్లి చేస్తామని రూ.3 లక్షలు, కొత్తూరులో రూ.2లక్షలు తీసుకుని చీట్ ​చేశారు.  చండ్రుగొండ మండలంలోని గానుగపాడుకు చెందిన ఒక యువకుడి కుటుంబసభ్యులతో మాట్లాడి రూ.5 లక్షలకు ఒప్పందం చేసుకొని రూ.4 లక్షలు తీసుకొని గత నెల 7న పెండ్లి జరిపించారు.

 ప్లాన్ ​ప్రకారం...రెండు రోజులకే లక్ష్మీశ్రావణి ఆ యువకుడిని సంసారానికి పనికి రావని అభాండాలు వేసి గొడవ స్టార్ట్​ చేసింది. తర్వాత రేణుక వారింటికి వచ్చి  ‘మా అమ్మాయి మీలాంటి వారింట కాపురం చేయదు. మేం వెళ్లిపోతాం’ అంటూ గలాటా చేసింది. వారు సర్ది చెప్పినా వినకుండా అడ్డువచ్చిన వారిని కొట్టి పరారయ్యారు. దీనిపై చండ్రుగొండ పోలీసులకు ఫిర్యాదు అందింది, మంగళవారం చండ్రుగొండలో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా తచ్చాడుతున్న ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకొని విచారించారు. వారు పెండ్లిళ్ల పేరుతో మోసాలు చేస్తున్నామని ఒప్పుకోవడంతో ఇద్దరిపై కేసు నమోదు చేశారు.