పగ తీర్చుకునేందుకే చంపేశారు

పగ తీర్చుకునేందుకే చంపేశారు

రుద్రారం జాతీయ రహదారిపై జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. మే 31న మహబూబ్ పాషా అనే వ్యక్తి సంగారెడ్డి కోర్టుకు వెళ్లి వస్తుండగా రుద్రారం జాతీయ రహదారిపై అడ్డగించిన కిరాయి రౌడీలు వేట కొడవలితో నరికి చంపారు. పోలీసులు మొత్తం 11 మందిని అదుపులోకి తీసుకొని విచారించగా హత్యకు గల కారణాలు పాతకక్షలే అని తేలింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ రాజేశ్వరరావు  మంగళవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. 2018 నవంబర్ నెలలో జరిగిన భోలక్ పూర్ కు చెందిన మహ్మద్ హర్షద్  హత్య కేసులో మహబూబ్ పాషా ప్రధాన నిందితుడు. హర్షద్ తండ్రి అక్తర్ తన కొడుకు చంపినందుకు ప్రతీకారంగా మహబూబ్ పాషాను చంపాలనుకున్నాడు. తన మరో ముగ్గురు కొడుకులైన అఖిల్ హుస్సేన్, అన్సార్, అసిఫ్ లతో కలిసి స్కెచ్ వేశాడు. గుల్బర్గాకు చెందిన మహ్మద్ ఖలీల్ మధ్యవర్తిత్వం ద్వారా అదే ప్రాంతానికి చెందిన మహ్మద్ అహ్మద్, మహ్మద్ బాబా, ఖలీల్ తో  ఫోన్ లో మాట్లాడిన అక్తర్ మహబూబ్ పాషాను చంపేందుకు రూ.6లక్షల సుపారి మాట్లాడాడు. గుల్బర్గాకు చెందిన సుపారి గ్యాంగ్ కు రూ.లక్ష అడ్వాన్స్ గా ఇచ్చాడు. ఇందులో అహ్మద్ అనే వ్యక్తి రూ.80వేలతో గుల్బర్గాలో పిస్తోలు కొన్నాడు.   ఈ ఏడాది మే 31న హర్షద్ హత్య కేసులో సంగారెడ్డి కోర్టుకు వెళ్లి తిరిగి వస్తున్న మహబూబ్ పాషాను సుపారి గ్యాంగ్ రెండు కార్లు, ఓ బైక్ పై వెంబడించింది. రుద్రారం జాతీయ రహదారిపై మహబూబ్ పాషాను అడ్డగించి వేట కొడవళ్లతో నరికి చంపారు. ఈ ఘటపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మొత్తం 14 మందికి ఈ హత్యతో సంబంధం ఉన్నట్టు గుర్తించారు. ఇందులో 11 మంది నిందితులు.. చర్లపల్లికి చెందిన మహ్మద్ అన్సార్ ,హుస్సేన్ ,అసిఫ్,అఖిల్ హుస్సేన్, అబ్దుల్ మన్నన్, మహబూబ్, మహ్మద్ ఖలీల్, అబ్దుల్ ఇజాజ్, మహ్మద్ ఫైజాన్ తో పాటు  కర్ణాటక  రాష్ట్రంలోని  గుల్బర్గాకు చెందిన మహ్మద్ ఖలీల్, మహ్మద్ అహ్మద్, మహ్మద్ బాబాలను  పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల దగ్గరి నుంచి ఓ పిస్తోలు, 5 బుల్లెట్లు, 2 కత్తులు,13 సెల్ ఫోన్లు, రూ.50వేలు డబ్బు, 2 కార్లు , 2 బైకులను  స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మరో ముగ్గురు నిందితులు అక్తర్ హుస్సేన్,దావూద్, ఫిరోజ లు పరారీలో ఉన్నట్టు తెలిపారు. పట్టుకున్న నేరస్థులపై సెక్షన్ 147 ,148, 307 ,R/W  149 ఐపీసీ సెక్షన్, పిస్తోల్ ,కత్తులు వాడినందుకు గాను 25 (1) ( బి ) ఇండియన్ ఆర్మ్స్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదుచేసినట్టు పోలీసులు చెప్పారు. నిందితుల కోసం 6 స్పెషల్ టీమ్ లుగా ఏర్పడి కర్ణాటక రాష్ట్రం గుల్బర్గా లో వారిని పట్టుకున్నట్లు వెల్లడించారు.ఈ సమావేశంలో పటాన్ చెరు సీఐ నరేష్, క్రైం సీఐ లాలూనాయక్, బీడీఎల్ సీఐ వేణుగోపాల్ రెడ్డి, జిన్నారం సీఐ రవి, ఎస్సైలు పాల్గొన్నారు.