మరోసారి కూతురితో బయటికొచ్చిన కిమ్

మరోసారి కూతురితో బయటికొచ్చిన  కిమ్

ఉత్తర కొరియాలో భవిష్యత్తులో వారసత్వ రాజకీయం సాగనుందా..? కిమ్ తన వారసులకే దేశ బాధ్యతలు అప్పగించనున్నాడా.. ? ఈ ప్రశ్నలు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తున్నాయి. కారణం ఆ దేశ అధ్యక్షుడు కిమ్ అధికారిక కార్యక్రమాల్లో తన కూతుర్ని ఇన్వాల్వ్ చేయడమేనని అంతా అనుకుంటున్నారు. గత కొన్ని రోజులుగా కనిపించకుండా పోయిన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ మళ్లీ వార్తల్లో కెక్కారు. దాదాపు 40 రోజుల తర్వాత కొరియన్ పీపుల్స్ ఆర్మీ 75వ వార్షికోత్సవ కార్యక్రమంలో ప్రత్యక్షమయ్యారు.

ఆయనతో పాటు ఆయన తొమ్మిదేళ్ల కూతురు కిమ్ జు ఏ కూడా ఉండడంతో.. అందరి దృష్టీ ఆమె పైనే పడింది. ఇటీవల జరిగిన ఓ మిస్సైల్ పరీక్ష సమయంలోనూ జూ ఏను కిమ్ తోడుగా తీసుకెళ్లారు. ఇలా ఆమెను వెంటబెట్టుకొని ఇది నాలుగో సారి. ఇలా పదే పదే కిమ్ తన కూతుర్ని వెంటబెట్టుకొని అధికారిక కార్యక్రమాలకు హాజరవుతుండడం పలు అనుమానాలకు తావిస్తోంది. భవిష్యత్తులో దేశ పగ్గాలు ఆమెకే అప్పగించనున్నారని, ఇది వారసత్వ పాలనకు సంకేతమేనని పలువురు అభిప్రాయపడుతున్నారు.