14 పరుగుల తేడాతో పంజాబ్ ఘన విజయం

14 పరుగుల తేడాతో పంజాబ్ ఘన విజయం

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఖాతాలో మరో విక్టరీ నమోదైంది.. సొంతగడ్డ మొహాలీలో ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచులో.. 14 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. బౌలర్లు మ్యాజిక్ చేయడంతో…  167 పరుగుల టార్గెట్ ను చేరుకోలేక ఢిల్లీ క్యాపిటల్స్ టీం బ్యాట్ ఎత్తేసింది.  చివర్లో సామ్ కరణ్ హ్యాట్రిక్ వికెట్లు తీసి మ్యాచ్ విన్నింగ్ లో కీలకంగా వ్యహరించాడు.

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ టీం.. నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి.. 166 పరుగులు చేసింది. మ్యాచ్ ఆరంభంలో దూకుడుగా ఆడిన కేఎల్ రాహుల్ 15 పరుగులు, సామ్ కరణ్ 20 పరుగుల చేసి పెవిలియన్ దారి పట్టారు. 36 పరుగులకే కీలకమైన రెండు వికెట్లు కోల్పోయింది.  మరో 22 పరుగుల వ్యవధిలోనే అగర్వాల్ 6 పరుగులు చేసి ఔట్ కావడంతో.. టీం కష్టాల్లో పడింది. ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన సర్ఫరాజ్ ఖాన్ 39, డేవిడ్ మిల్లర్ 43 పరుగులు చేసి .. స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. వీరిద్దరు కలిసి 62 పరుగుల భాగస్వామ్యం చేశారు.  ఆ తర్వాత మన్ దీప్ సింగ్ 29 పరుగులు చేసి నాటౌట్ గా నిలవడంతో 166 పరుగులు చేసింది పంజాబ్. ఢిల్లీ బౌలర్లలో క్రిస్ మోరిస్ 3 వికెట్లు, లామ్ చెన్, రబడాలు చెరో 2 వికెట్లు తీశారు.

167 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ కు ఆదిలోనే ఆటంకాలు మొదలయ్యాయి. ఇన్నింగ్స్ మొదటి బంతికే పృథ్వీషా డకౌట్ అయ్యాడు. శిఖర్ ధావన్ 30,శ్రేయస్ అయ్యర్ 28 పరుగులతో కీలకమైన 61 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు.  రిషబ్ పంత్ 39, కొలిన్ ఇన్ గ్రామ్ 45 పరుగులు చేసినా మ్యాచ్ ను కాపాడలేకపోయారు. చివర్లో పంజాబ్ బౌలర్ల ధాటికి కుప్పకూలిపోయారు.  చివరి నాలుగు ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి మ్యాచ్ ను చేజార్చుకుంది ఢిల్లీ క్యాపిటల్స్. పంజాబ్ బౌలర్లలో సామ్ కరణ్ 4, అశ్విన్, షమీలు చెరో 2 వికెట్లు తీశారు. దీంతో 19 ఓవర్ల 2 బంతుల్లో 152 పరుగులు చేసి ఢిల్లీ జట్టు ఆలౌట్ అయ్యింది.

పాయింట్ల పట్టికలో హ్యాట్రిక్ విజయాలతో చెన్నై సూపర్ కింగ్స్… 6 పాయింట్లతో ఫస్ట్ ప్లేస్ లో ఉంది. 4 మ్యాచులు ఆడి మూడింట్లో గెలిచిన పంజాబ్ జట్టు… ఆరు పాయింట్లతో సెకండ్ ప్లేస్ లో నిలిచింది.