ఆపరేషన్ గంగ: స్లొవేకియా వెళ్లిన కేంద్ర మంత్రి రిజిజు

ఆపరేషన్ గంగ: స్లొవేకియా వెళ్లిన కేంద్ర మంత్రి రిజిజు

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారత పౌరులు, విద్యార్థులను స్వదేశానికి తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ గంగ’  షురూ చేసింది. ఈ ఆపరేషన్‌లో భాగంగా ఉక్రెయిన్ సిటీల్లో ఉన్న ఇండియన్స్‌ను సరిహద్దులకు తరలించి, అక్కడి నుంచి పొరుగు దేశాల్లోని ఎయిర్‌‌పోర్టుకు తీసుకెళ్లి ప్రత్యేక విమానాల్లో ఇండియాకు తీసుకొస్తోంది. ఇప్పటి వరకు తొమ్మిది ఫ్లైట్స్‌లో 2,012 మంది భారతీయులను స్వదేశానికి తరలించింది. అయితే ఉక్రెయిన్‌లో క్షణక్షణానికీ పరిస్థితులు మారిపోతున్న నేపథ్యంలో భారతీయుల తరలింపు ఆపరేషన్ మరింత వేగవంతం చేసేందుకు ప్రధాని మోడీ వ్యూహాత్మకంగా పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా ఉక్రెయిన్‌కు సరిహద్దు కలిగి ఉండి, ఎవాక్యుయేషన్‌కు వీలయ్యే అన్ని దేశాల నుంచి మన వాళ్లను తీసుకొచ్చేందుకు నిర్ణయించారు. దీనికి సంబంధించి దగ్గరుండి తరలింపు ఆపరేషన్‌ను పర్యవేక్షించేందుకు కేంద్ర మంత్రులు కిరెణ్ రిజిజు, హరదీప్ సింగ్ పూరీ, జ్యోతిరాదిత్య సింధియా, వీకే సింగ్‌లను ఉక్రెయిన్‌ పక్క దేశాలకు వెళ్లాలని ఆదేశించారు.

స్లొవేకియా ప్రభుత్వ సహకారంతో..

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న వారిని స్వదేశానికి తరలించే ‘ఆపరేషన్ గంగ’ పర్యవేక్షణ కోసం కేంద్ర మంత్రి కిరెణ్ రిజిజు ఇవాళ సాయంత్రం ఉక్రెయిన్ పొరుగు దేశమైన స్లొవేకియాకు వెళ్లారు. ఢిల్లీ నుంచి బయలుదేరే ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. ఉక్రెయిన్ నుంచి మన పౌరులను సేఫ్‌గా తీసుకురావడమే తమ టాప్ ప్రయారిటీ అని రిజిజు చెప్పారు. ఉక్రెయిన్‌ సరిహద్దు దాటి స్లొవేకియాలోకి అడుగుపెట్టే ఇండియన్స్‌కు వీసా సహా ఇతర ఇబ్బందులు రాకుండా స్లొవేకియా ప్రభుత్వ సహకారం తీసుకుంటామని ఆయన అన్నారు. భారత పౌరులు, విద్యార్థుల తరలింపు సాఫీగా సాగేలా స్లొవేకియాలో ఉండి ఎప్పటికప్పుడు ఏర్పాట్లు పర్యవేక్షిస్తానని అన్నారు. 

స్లొవేకియా ప్రధానితో ఫోన్‌లో మాట్లాడిన మోడీ

స్లొవేకియా ప్రధాని ఎడ్వర్డ్‌ హేగర్‌‌తో మన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నిన్ననే (సోమవారం) ఫోన్‌లో మాట్లాడారు. భారత పౌరులను సురక్షితంగా తరలించేందుకు ప్రత్యేక విమానాలను అనుమతించడంతో పాటు ఇతర సహాకారం అందిస్తున్నందుకు థ్యాంక్స్ చెప్పారు. ఇండియన్స్‌ తరలింపు పూర్తయ్యే వరకూ ఈ సహకారాన్ని కొనసాగించాలని కోరారు. తన ప్రతినిధిగా కేంద్ర మంత్రి కిరెణ్‌ రిజిజు స్లొవేకియాకు చేరుకుని తరలింపును పర్యవేక్షిస్తారని కూడా ఎడ్వర్డ్‌కు మోడీ తెలిపారు.

మరిన్ని వార్తల కోసం...

ఎలన్ మస్క్‌కు థ్యాంక్స్ చెప్పిన ఉక్రెయిన్ ఉప ప్రధాని

రష్యా దాడిలో నవీన్ మృతి.. తండ్రితో మాట్లాడిన మోడీ

ఈ సమయంలో ప్రతి క్షణమూ అమూల్యమైనదే: రాహుల్ గాంధీ