బీఆర్ఎస్​ను బొంద పెడ్తం.. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తిరెడ్డి

బీఆర్ఎస్​ను బొంద పెడ్తం..  బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తిరెడ్డి

రేగొండ/మొగుళ్లపల్లి, వెలుగు: తెలంగాణలో నిరంకుశ పాలన కొనసాగిస్తున్న బీఆర్ఎస్​ను వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బొందపెడతామని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తిరెడ్డి  అన్నారు. రాష్ట్రంలో  అమలవుతున్న సంక్షేమ పథకాలన్నింటికీ కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కారేనిధులు సమకూరుస్తున్నదని ఆమె చెప్పారు. శుక్రవారం జయశంకర్​ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం కోటంచలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కీర్తిరెడ్డి మాట్లాడారు. రాష్ట్ర ప్రజలను సీఎం కేసీఆర్​ నమ్మించి మోసం చేస్తున్నారని మండిపడ్డారు.

బీసీబంధు, దళితబంధు బీఆర్ఎస్​ నేతలకు అందాయని ఆరోపించారు. గృహలక్ష్మి పేరుతో గ్రామాల్లో నిరుపేదలు తమ ఇండ్లను కూలగొట్టుకుని ఇండ్ల నిర్మాణం చేపట్టారని, ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్​కు ఓటు వేయకుంటే బిల్లులు రావంటూ లబ్ధిదారులను ఆ పార్టీ నేతలు బెదిరింపులకు గురిచేస్తున్నారని ఫైరయ్యారు. బీజేపీకి ఒకసారి అవకాశం ఇస్తే తెలంగాణను అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. పార్టీలు మారే వారు ప్రజలకు ఏమీ చేయలేరని, ఓటు అడిగే నైతిక హక్కు అలాంటి వారికి లేదన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు రాజమౌళిగౌడ్​, పాపయ్య, నిశిధర్​రెడ్డి, ప్రసాద్​రావు, తిరుపతిరావు, దాసరి తిరుపతిరెడ్డి, చాడ రఘునాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పదవుల కోసం పార్టీ మారేటోళ్లను నమ్మొద్దు

పదవుల కోసం పార్టీలు మారే వారిని ప్రజలు నమ్మొద్దని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తిరెడ్డి చెప్పారు. శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని పలు గ్రామాల్లో నిర్వహించిన బూత్  లెవెల్ ప్రచారంలో ఆమె మాట్లాడారు. విశ్వకర్మ పథకం పేదల కోసం పెట్టిందని, దీంతో దాదాపు 15 కులాల వారికి రూ.3 లక్షల వరకు ఆర్థిక సాయం అందించి ఉపాధి కల్పించిన ఘనత కేంద్రంలోని బీజేపీకి దక్కిందని చెప్పారు.

కేసీఆర్  సర్కార్  ప్రవేశపెట్టిన పథకాలు అర్హులకు అందడం లేదన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్  ప్రకటించిన మ్యానిఫెస్టోలు ప్రజల కోసం కాకుండా ఒకరికొకరు వేలంపాట వేసుకున్నట్లు ఉందని ఎద్దేవా చేశారు. తమ పార్టీ ప్రవేశపెట్టే మ్యానిఫెస్టో ప్రజల కోసం ఉపయోగపడేలా ఉంటుందన్నారు. బీఆర్ఎస్ కు కాంగ్రెస్  బీ టీం అన్నారు. భూ కబ్జాలు, అవినీతి కల్తీ దందాలకు భూపాలపల్లి అడ్డగా మారిందని, అలాంటి వాటిని అంతం చేయాలంటే బీజేపీకి పట్టం కట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రెసిడెంట్  యుగంధర్, స్టేట్ కమిటీ మెంబర్లు రామచంద్రారెడ్డి, పాపయ్య, ఎంపీటీసీ రాజయ్య పాల్గొన్నారు.