బీసీలను కాంగ్రెస్ రాజకీయంగా వాడుకుంటున్నది: కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి

బీసీలను కాంగ్రెస్ రాజకీయంగా వాడుకుంటున్నది: కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి
  • బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర సర్కార్​కు చిత్తశుద్ధి లేదు
  • హైకోర్టు సాక్షిగా బీసీలకు కాంగ్రెస్ మోసం: బండి సంజయ్ ట్వీట్

    
న్యూఢిల్లీ, వెలుగు: కాంగ్రెస్ పార్టీ బీసీలను రాజకీయంగా వాడుకుంటున్నదని కేంద్ర బొగ్గు, గ‌‌‌‌నుల శాఖ మంత్రి కిష‌‌‌‌న్‌‌‌‌రెడ్డి విమ‌‌‌‌ర్శించారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 9పై హైకోర్టు స్టే విధించిందన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరించి విధానం దురదృష్టకరమ‌‌‌‌ని పేర్కొన్నారు. సీఎం రేవంత్ నేతృత్వంలోని సర్కార్ చేతగానితనం కారణంగానే ఈ తీర్పు వెలువడిందన్నారు. 

ఈ మేర‌‌‌‌కు గురువారం ఢిల్లీలో కిషన్ రెడ్డి ఆఫీసు మీడియాకు ఒక ప్రకటన విడుద‌‌‌‌ల చేసింది. బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలన్న విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. అందుకే ముందుగానే ప్లాన్‘బీ’ని సిద్ధం చేసుకుని కోర్టులో తూతూమంత్రంగా వాదనలు వినిపించిందని దుయ్యబ‌‌‌‌ట్టారు. బీసీలకు న్యాయం చేయాలన్న ఆలోచన కాంగ్రెస్ పార్టీకి ఏనాడూ లేద‌‌‌‌న్నారు. 

కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే.. సుప్రీంకోర్టు రిజర్వేషన్లపై 50 శాతం క్యాప్ ను నిర్దేశించిన విష‌‌‌‌యాన్ని గుర్తు చేశారు. ఈ విషయం తెలిసినా.. రాజ్యాంగపరమైన నిబంధనలపై కనీస అవగాహన లేకుండా రేవంత్ సర్కారు వ్యవహరించిందన్నారు. బీసీలకు రిజర్వేషన్ల విషయంలో రాష్ట్రప్రభుత్వం అనుసరిస్తున్న తీరును బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందని కిష‌‌‌‌న్‌‌‌‌రెడ్డి స్పష్టం చేశారు.