భూములు అమ్మనిదే..ప్రభుత్వానికి పూట గడవట్లేదు : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

భూములు అమ్మనిదే..ప్రభుత్వానికి పూట గడవట్లేదు : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
  • కాంగ్రెస్‌‌కు బీఆర్‌‌‌‌ఎస్‌‌కు ఏం తేడా లేదు  : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి 

నల్గొండ, వెలుగు: పార్టీ ఫిరాయింపుల విషయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్‌‌కు  ఏ మాత్రం తేడా లేదని, రెండు పార్టీలు ఒక్కటేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు.  ఏ హామీని అమలు చేశారని విజయోత్సవాలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు.  ఏ ఒక్క నిరుద్యోగికి నిరుద్యోగ భృతి ఇవ్వలేదని, మహిళలకు ఇస్తామన్న ఏ హామీని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదన్నారు.  

ఆదివారం నల్గొండ  బీజేపీ కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ..  దేవుడిపై ప్రమాణం చేసి హామీలు ఇచ్చిన రేవంత్ ఎన్నింటిని అమలు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. సన్న బియ్యంలో  కేంద్రం రూ.43 ఇస్తోందని, రాష్ట్ర వాటా కేవలం రూ.15 మాత్రమే ఇస్తోందని, ఇందిరమ్మ ఇంటి నిర్మాణంలో రూ. లక్షన్నర కేంద్రం వాటా కింద ఇస్తోంది. 

మహిళలకు ఇస్తామన్న ఏ హామీని అమలు చేయలేదు. ఏ హామీని అమలు చేశారని విజయోత్సవాలు చేస్తున్నారని ప్రశ్నించారు. తెలంగాణలో సింగరేణి నుంచి హైటెక్ సిటీ వరకు విపరీతంగా భూ దందా సాగుతోంది. భూములు అమ్మనిదే పూట గడవట్లేదు. మద్యం అమ్మకాలు విపరీతంగా పెంచారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇవ్వడం లేదు. సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం 42 వేల కోట్ల అప్పు ఉంది. 

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కేసీఆర్ హయాంలో ఎలా ఉందో ఇప్పుడు అలానే తయారైంది. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను రెండేళ్లలో ఎన్ని అమలు చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు.  కేసీఆర్‌‌‌‌ హయాంలో నియంత పాలన కొనసాగిందని ఆయన ఆరోపించారు. రెండు సంవత్సరాల పాలనలో పేద ప్రజల కు ఎలాంటి మేలు చేయని సీఎం రేవంత్ రెడ్డి ఏ మొహం పెట్టుకొని వారోత్సవాలు నిర్వహిస్తున్నాడని ఎద్దేవా చేశారు. 

కేసీఆర్ కేంద్రీకృతమైన అవినీతికి పాల్పడ్డాడని, రేవంత్ రెడ్డి, మంత్రులు వికేంద్రీకృత అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు.  తెలంగాణ మంత్రివర్గంలో సమన్వయం లేదన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పై రాజీలేని పోరాటం నిర్వహిస్తామని కిషన్ రెడ్డి హెచ్చరించారు.  సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి, రాష్ట్ర నాయకులు కాసం వెంకటేశ్వర్లు, గోలి మధుసూదన్ రెడ్డి, వీరెల్లి చంద్రశేఖర్, శ్రీనివాస్ గౌడ్, పాలకూరి రవి, గడ్డం మహేష్ తదితరులు పాల్గొన్నారు.