కేసీఆర్ సకల జనుల ద్రోహి.. తెలంగాణలో బెస్ట్ డ్రింకింగ్ పాలసీని అమలు చేస్తుండు

కేసీఆర్ సకల జనుల ద్రోహి.. తెలంగాణలో బెస్ట్ డ్రింకింగ్ పాలసీని అమలు చేస్తుండు

సీఎం కేసీఆర్ సకలజనుల ద్రోహి అని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మేనిఫెస్టోతో కేసీఆర్ తెలంగాణ ప్రజల్లో గులాబీ పువ్వులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మరోసారి మాయమాటలు చెప్పి మోసం చేస్తున్నారని విమర్శించారు. 

సంపద పెంచాలంటున్న కేసీఆర్..తెలంగాణలో అవినీతిని పెంచారని కిషన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో కేసీఆర్ బెస్ట్ డ్రింకింగ్ పాలసీని అమలు చేస్తున్నారని మండిపడ్డారు. బెస్ట్ చీటింగ్ పాలసీని అమలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా..ఇప్పుడు కొత్త హామీలను ఇస్తూ మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డట్లూ..ఐదేండ్ల తర్వాత ఏం చేయబోతున్నారో హామీలు ఇస్తున్నారని చురకలంటించారు. 

కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేస్తుంటే..ఇప్పుడు కేసీఆర్..అంతకు మించి అబద్దపు హామీలతో మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఇష్టానుసారంగా హామీలు ఇస్తున్న కేసీఆర్..కేజీ టూ పీజీ విద్య హామీ ఏమైందని ప్రశ్నించారు. నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం హామీ ఏమైందని అడిగారు.  2014, 2018, 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఏయే హామీలు ఇచ్చారో చెబుతారని అని నిలదీశారు. ఒకసారి మీ ముఖం అద్దం ముందు పెట్టుకోండంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

కేసీఆర్ మాటలు కోటలు దాటుతున్నాయని కానీ..చేతలు మాత్రం శూన్యం అన్నారు కిషన్ రెడ్డి. వరంగల్ లో టెక్స్ టైల్ సిటీ ఏర్పాటు చేస్తామని ఇంత వరకు కూడా స్థలం చూపించలేదన్నారు. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఏమయ్యాని ప్రశ్నించారు. గ్రామ పంచాయితీలకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. హైదరాబాద్ కు ఉత్తరాన ఇంటర్నేషనల్ అవార్డు, మూసీ నది ప్రక్షాళన వంటి హామీలు ఎక్కడ పోయాయని నిలదీశారు. గతంలో కేసీఆర్ ఇచ్చిన హామీలపై చర్చకు సిద్దమా అని సవాల్ విసిరారు కిషన్ రెడ్డి.