రాష్ట్రంలో 17సార్లు పేపర్ లీకేజీ ఘటనలు జరిగాయి : కిషన్ రెడ్డి

రాష్ట్రంలో 17సార్లు పేపర్ లీకేజీ ఘటనలు జరిగాయి : కిషన్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో 17 సార్లు ఎగ్జామ్ పేపర్స్ లీకేజీ అయ్యాయని కేంద్ర మంత్రి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి చెప్పారు. గత తొమ్మిది సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు టీచర్ ఉద్యోగాలను ఎందుకు భర్తీ చేయలేదని ప్రశ్నించారు. పేపర్ లీకేజీ కారణంగా లక్షలాది మంది నిరుద్యోగులు రోడ్ల మీద పడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇప్పటికే 6 లక్షలు ఉద్యోగాలు ఇచ్చామని, మరో 6 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. చంద్రయాన్ 2 ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేశామన్నారు.

హైదరాబాద్ బషీర్బాగ్లోని భారతీయ విద్యాభవన్లో రోజ్గార్ మేళా నిర్వహించారు. ఈ  కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కేంద్ర మంత్రి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉన్న పలు సంస్థల్లో సెలక్ట్ అయిన యువతీ, యువకులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన కిషన్ రెడ్డి.. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులను అభినందించాల్సిన అవసరం ఉందన్నారు.

గతంలో రైల్వేస్టేషన్లు అపరిశుభ్రంగా కనిపించేవని, స్వచ్ఛభారత్ అమల్లోకి వచ్చాక రైల్వేస్టేషన్లు పరిశుభ్రంగా ఉంటున్నాయని చెప్పారు కిషన్ రెడ్డి. పోస్టల్ డిపార్ట్ మెంట్ ప్రతి గ్రామంలో బ్యాంకుగా మారిందన్నారు. నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అద్భుతంగా  పని చేస్తున్నారని కితాబునిచ్చారు. మోదీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రతిసారి 50 కోట్ల మంది వరకు వీక్షిస్తున్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న  సంస్థలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడమే ప్రధాని మోదీ లక్ష్యమన్నారు. 

మహిళల ఆత్మగౌరవం కాపాడేందుకు టాయిలెట్స్ నిర్మించామని, వంట గ్యాస్ కనెక్షన్స్ అందించామని చెప్పారు కిషన్ రెడ్డి. మహిళల కోసం 40 కోట్ల జనధన్ అకౌంట్ ఖాతాలను మోదీ తెరిపించారన్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే ఒక లక్షా 20 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి జాతీయ రహదారులను నిర్మాణం చేపట్టామన్నారు. దేశంలో అద్భుతంగా జాతీయ రహదారుల నిర్మాణాలు జరుగుతున్నాయని వివరించారు. ప్రభుత్వ ఉద్యోగులను తిట్టడం కాకుండా.. వారిని మోటివేషన్ చేసి పనులు చేయించుకోవాలన్నారు. 

కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఉద్యోగాలు ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రుల రికమండేషన్ లేకుండానే యువతకు ఉద్యోగాలు వస్తున్నాయని అన్నారు. రోజ్గార్ మేళా ద్వారా ఉద్యోగ నియమాకాల్లో ఎలాంటి అవినీతి, మోసం జరిగేందుకు చాన్స్ లేదన్నారు. గతంలో పోస్ట్ ఆఫీసులల్లో ఇంటర్వ్యూ లేకుండా... పై అధికారి మోక్షం వల్ల ఉద్యోగాలు వచ్చేవన్నారు. ఇవాళ ఉత్తీర్ణులను గుర్తించి ఇంటర్వ్యూ చేసుకుని ఉద్యోగాలు ఇస్తున్నారని చెప్పారు.