అవినీతి, కుటుంబ పార్టీలు ఓడిపోవాలి .. అవి గెలిస్తే ఆర్థిక విధ్వంసమే: కిషన్​రెడ్డి 

అవినీతి, కుటుంబ పార్టీలు ఓడిపోవాలి .. అవి గెలిస్తే ఆర్థిక విధ్వంసమే: కిషన్​రెడ్డి 
  • భారీ విజయంతో ఈసారి తెలంగాణలో అధికారంలోకి వస్తున్నం
  • మొదటిసారి బీసీ సీఎం బాధ్యతలు తీసుకోబోతున్నరు
  • డబుల్ ఇంజిన్ సర్కారుతోనే అన్ని వర్గాలకు న్యాయం

హైదరాబాద్, వెలుగు : ఈ ఎన్నికల్లో ప్రజలు, ప్రజాస్వామ్యం గెలవాలని, అవినీతి కుటుంబ పార్టీలు ఓడిపో వాలని బీజేపీ కోరుకుంటుందని ఆ పార్టీ స్టేట్ చీఫ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. అవినీతి పార్టీలు, కుటుంబ పార్టీలు ఓడిపోవాలని తెలంగాణ సమాజం అనుకుంటుందన్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని అవహేళన చేసే పార్టీలకు, సామాజిక తెలంగాణకు అడ్డుగా ఉన్న పార్టీలకు, తెలంగాణ అమరవీరుల ఆకాంక్షలకు అడ్డుగా ఉన్న పార్టీలకు ఈ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధిచెబుతారనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. మంగళవారం బీజేపీ మీడియా సెంటర్​లో కిషన్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. మరోసారి బీఆర్ఎస్, కాంగ్రెస్ ల చేతుల్లో తెలంగాణ ప్రజలు పడకూడదు. 

ఉద్యోగులకు జీతాలిచ్చే పరిస్థితి

ఓవైపు కేసీఆర్ కుటుంబం, మరోవైపు సోనియా కుటుం బం..ఈ రెండు పార్టీల అవినీతిని ప్రజలు బహిష్కరించాలని కిషన్ రెడ్డి కోరారు. ‘‘ఈ పార్టీలు అబద్ధాలతో, కుట్రలతో, కుతంత్రాలతో తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నాలు చేశాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం జరగడం ఖాయం.  ఉద్యోగులకు జీతాలిచ్చే పరిస్థితి లేదు. తెలంగాణ మిత్రులెవరో, ఎవరి ద్వారా తెలంగాణ అభివృద్ధి జరుగుతుందో గుర్తించి.. ఇక్కడి ప్రజలు ఇప్పుడు బీజేపీ వెంట నడుస్తున్నారు”అని అన్నారు.

బీజేపీ అగ్ర నేతలు మోదీ, అమిత్ షా, నడ్డా ప్రచార కార్యక్రమాలు, రోడ్ షోలు పార్టీకి కొత్త ఊపునిచ్చాయన్నారు. ఊహించిన దానికంటే అద్భుత స్పందన వచ్చిందని, అభివృద్ధి చేసే బీజేపీ టీమ్​ను ప్రజలు ఆదరించారన్నారు. ప్రజాస్వామ్యాన్ని, ప్రజాభిప్రాయాన్ని డబ్బు, మద్యంతో కొనేందుకు.. బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రయత్నం చేశా యి. ఆ రెండు పార్టీలకు సరైన బుద్ధి చెప్పాలని తెలం గాణ ప్రజలను కోరారు. 

సర్వేలను పట్టించుకోం..

కొన్ని సర్వేలు బీజేపీకి ఇస్తున్న సీట్ల సంఖ్యను తమ కార్యకర్తల మనోబలాన్ని, సంకల్పాన్ని ఏమాత్రం కదిలించలేకపోయాయని కిషన్​రెడ్డి అన్నారు. ‘సర్వేలు మా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బదీయలేకపోయాయి. ప్రజలు మాకు మద్దతుగా నిలుస్తుండటంతో సర్వేలను పట్టించుకోవడం లేదు. 30న సునామీ లాగా ప్రజలు మాకు అనుకూలంగా ఓటేస్తారు. వచ్చే నెల 3న బీజేపీ అధికారంలోకి రానుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు.

స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొట్టమొదటి బీసీ సీఎం ఈ గడ్డపై బాధ్యతలు తీసుకోబోతున్నారు”అని కిషన్ రెడ్డి చెప్పారు. రాహుల్, ప్రియాంక గాంధీలకు కనీస రాజకీయ అవగాహన కూడా లేదని, మజ్లిస్ ను పెంచి పోషించిందే వాళ్ల కుటుంబం అని మండిపడ్డారు. డబుల్ ఇంజన్ సర్కారుతోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. సీఎం తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు మెడికల్ కాలేజీల విషయంలో మళ్లీ అబద్ధాలు ఆడుతున్నారన్నారు. ‘‘కేసీఆర్ రాష్ట్రానికి మెడికల్ కాలేజీల గురించి కేంద్రానికి వంద లేఖలు రాసిన అని చెప్పారు కదా....అందులో కనీసం 30 లేఖలైనా చూపించాలి”అని డిమాండ్ చేశారు. సామాజిక న్యాయానికి కట్టుబడి ఉండే బీజేపీ.. మైనారిటీ, ఎస్సీ, ఎస్టీలను రాష్ట్రపతులను చేసిందన్నారు.