ఒక కుటుంబానికి తెలంగాణ బలి : కిషన్ రెడ్డి

ఒక కుటుంబానికి తెలంగాణ బలి : కిషన్ రెడ్డి
  • నియంత పాలనతో రాష్ట్రం వెనుకబాటు: కిషన్ రెడ్డి 
  • యూపీఏ హయాంలో రోజూ స్కాంలేనన్న కేంద్ర మంత్రి 
  • మల్కాజిగిరిలో వికసిత్ భారత్ సంకల్ప్​ సభ
  • బీజేపీ రాష్ట్ర ఇన్​చార్జ్ బన్సల్, ఎంపీలు లక్ష్మణ్, డీకే అరుణ, ఈటల తదితరుల హాజరు

హైదరాబాద్, వెలుగు: ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న తెలంగాణ చివరకు ఒక కుటుంబానికి బలైపోయిందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను మాజీ సీఎం కేసీఆర్ కుటుంబం అప్పుల పాలు చేసిందని ఆరోపించారు. ఒక నియంత పాలనతో రాష్ట్రం అభివృద్ధిలో వెనుకబడిందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ11 ఏండ్ల పాలన పూర్తయిన నేపథ్యంలో ఆదివారం మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో జరిగిన వికసిత్ భారత్ సంకల్ప సభలో కిషన్ రెడ్డి మాట్లాడారు. 

బీఆర్ఎస్ పాలనపై ప్రజలు విసుగు చెంది మార్పు కోరుకుని కేసీఆర్ ను గద్దె దించారన్నారు. కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు చూసి ప్రజలు ఆ పార్టీకి అధికారం ఇచ్చారని, ఇపుడు అధికారం చేపట్టాక ప్రజలకు ఏమీ చేయలేకపోతున్నామని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారని అన్నారు. యూపీఏ ప్రభుత్వంలో ఎప్పుడు చూసినా కుంభకోణాలు, అవినీతిపై వార్తలు వచ్చేవని, అందుకే దేశ ప్రజలు 2014లో మోదీని ప్రధానిని చేశారన్నారు. 

గతంలో పాకిస్తాన్ ఆడిందే ఆటగా సాగిందని, ఐఎస్ఐ ఏజెంట్ల ద్వారా దేశాన్ని అంతలాకుతలం చేశారన్నారు. మోదీ ప్రధాని అయ్యాక ఉగ్రవాద చర్యలకు తావు లేకుండా చర్యలు తీసుకున్నట్లు వివరించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు తీరాలంటే బీజేపీతోనే సాధ్యమన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి అధికారాన్ని అందించాలని కోరారు. 

బీసీ రిజర్వేషన్లలో 10 శాతం ముస్లింలకా? 

ప్రధాని మోదీ వికసిత్ భారత్ సాధించాలన్న సంకల్పంతో పని చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర ఇంచార్జ్ సునీల్ బన్సల్ అన్నారు. 2045 నాటికి వికసిత్ భారత్ ఏర్పాటు తప్పకుండా జరుగుతుందన్నారు. ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి ఓట్ల కోసం దిగజారిపోయారని అన్నారు. 

బీసీ రిజర్వేషన్లలో10 శాతం ముస్లింలకు ఇచ్చి.. బీసీల హక్కులను కాలరాస్తున్నారని ఆరోపించారు. ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ.. మోదీ పాలనలో దేశం అభివృద్ధి పథంలో సాగుతోందన్నారు. మోదీ పాలన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే ప్రతి జిల్లాలో  వికసిత్ భారత్ సంకల్ప సభలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ చరిత్ర మొత్తం అవినీతిమయమన్నారు. 

త్యాగాలు చేసి సాధించుకున్న రాష్ట్రంలో సీఎం రేవంత్ తీరు వల్ల తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతిందన్నారు. హైడ్రా, మూసీ దుర్మార్గమైన ఆలోచన అని విమర్శించారు. మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కార్పొరేటర్లను భారీగా గెలిపించుకుని గ్రేటర్ ను కైవసం చేసుకోవాలని పార్టీ క్యాడర్ కు పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మాట్లాడుతూ.. అనేక మంది ప్రధానులు పాలించినప్పటికీ, దేశాన్ని దారిద్ర్య రేఖ నుంచి బయటకు తేలేకపోయారని.. ఇది మోదీ ఒక్కరికే సాధ్యమైందన్నారు.

మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు మాట్లాడుతూ.. తనకు ఎలాంటి కోరికలు లేవని.. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలని, బీజేపీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారాన్ని ముందుండి చూడాలన్న కోరిక ఒక్కటే మిగిలిందన్నారు. కార్యక్రమంలో బీజేఎల్పీ నేత ఏలేటీ మహేశ్వర్ రెడ్డి, అభయ్ పాటిల్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు పాల్గొన్నారు.