- హిల్ట్ పాలసీతో భారీ ల్యాండ్ స్కామ్‌కు తెరలేపారని కామెంట్
న్యూఢిల్లీ, వెలుగు: కాంగ్రెస్ ఎప్పటికీ హిందూ వ్యతిరేక పార్టీ అని, ఇండియా అలయెన్స్‌లోని పార్టీలదీ అదే భావజాలమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో కిషన్ రెడ్డి బుధవారం మీడియాతో మాట్లాడారు. ‘‘హిందూ దేవుళ్లపై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన కామెంట్లను ఖండిస్తున్నం. దేవుళ్లను అవమానించేలా రేవంత్ అహంకారపూరితంగా మాట్లాడాడు.
హిందువుల మనోభావాలను కించపర్చాడు. యాంటీ హిందువుల స్టాండ్ తీసుకోవడం కాంగ్రెస్‌కు ఎప్పుడూ అలవాటే. కాంగ్రెస్ నేతలకు ఇతర మతాల గురించి మాట్లాడే దమ్ముందా? కాంగ్రెస్ అంటేనే ముస్లింలు.. ముస్లింలు అంటేనే కాంగ్రెస్ అంటూ బుజ్జగించేలా మాట్లాడుతారు. అదే హిందువుల గురించి మాత్రం కించపరిచేలా మాట్లాడటం దారుణం. గతంలో కేసీఆర్ కూడా ఇలాంటి కామెంట్లు చేశారు. ప్రజలు ఎలా బుద్ధి చెప్పారో అందరం చూసినం. రేవంత్ రెడ్డికి కూడా రాష్ట్ర ప్రజలు త్వరలోనే బుద్ధి చెప్తరు. ఇప్పటికైనా రేవంత్ హిందువులకు క్షమాపణ చెప్పాలి’’అని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు.
బడా వ్యాపారులకు లబ్ధి చేకూరేలా జీవో
‘హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్’ (హిల్ట్) పాలసీ పేరిట తెలంగాణ ప్రభుత్వం పెద్ద ల్యాండ్ స్కామ్‌కు తెరలేపిందని కిషన్ రెడ్డి ఆరోపించారు. బడా వ్యాపారులకు లబ్ధి చేకూర్చేందుకే ఈ జీవో తీసుకొచ్చారని ఆరోపించారు.
‘‘ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న పారిశ్రామిక వాడలను తరలించాలని, ఆ భూములను కమర్షియల్ అవసరాల కోసం వినియోగించుకునేందుకు మార్చుకునేలా అనుమతి ఇస్తూ జీవో 27 తెచ్చారు. సీఎం రేవంత్ రెడ్డికి ప్రజల ప్రయోజనాల కన్నా సొంత ప్రయోజనాలే ఎక్కువయ్యాయి. ప్రజా ప్రతినిధులతో, పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు, యాజమాన్యాలతో చర్చించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం దురదృష్టకరం’’అని కిషన్ రెడ్డి అన్నారు.
కేసీఆర్ మాదిరిగా రేవంత్ రెడ్డి
2014 నుంచి అన్నీ తానై వ్యవహరిస్తూ అన్ని నిర్ణయాలు తీసుకున్న కేసీఆర్ మేధావిలాగే.. రేవంత్ రెడ్డి రూపంలో మరో కొత్త మేధావి తెలంగాణ ప్రజలకు దొరికారని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ‘పరిశ్రమలు తరలించడంతో కార్మికుల భవిష్యత్తు గురించి కనీసం గుర్తు చేసుకున్నారా? దూరప్రాంతాలకు పరిశ్రమలు తరలిస్తే వారంతా ఎక్కడికి వెళ్లాలి? వారి కుటుంబాలు ఏమైపోవాలి? ట్రాఫిక్ సమస్య కారణంగా బెంగళూరులో పరిశ్రమలు తరలిపోతున్నాయి. మరి హైదరాబాద్ ను కూడా మరో బెంగళూరుగా మార్చాలని చూస్తున్నారా?’అని కిషన్ రెడ్డి నిలదీశారు.
