- 60 మంది నుంచి రూ. కోటికిపైగా దోపిడీ
- హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లోని ఓ ప్రైవేట్ సంస్థ దందా
- నిలదీయడంతో బాధిత ఉద్యోగులకే లీగల్ నోటీస్లు
హైదరాబాద్, వెలుగు: బ్యాంకు లోన్ల పేరుతో ప్రభుత్వ ఉద్యోగులను బురిడీ కొట్టించారు. ప్రాసెసింగ్ ఫీజు పేరిట లక్షల్లో వసూలు చేసి, లోన్లు ఇప్పించకుండానే బొర్డు తిప్పేశారు. డబ్బులు పోగొట్టుకున్న ప్రభుత్వ ఉద్యోగులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. హైదరాబాద్లోని ఎస్ఆర్ నగర్ కేంద్రంగా ఈ చీటింగ్ జరిగింది. సిబిల్ స్కోర్ తక్కువగా ఉండి లోన్లు రాక ఇబ్బంది పడుతున్న ప్రభుత్వ ఉద్యోగులను హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లోని ఓ ప్రైవేట్ సంస్థ టార్గెట్ చేసింది.
ఉమ్మడి వరంగల్, నల్గొండ, హైదరాబాద్, నిజామాబాద్ జిల్లాల్లోని విద్యుత్, సింగరేణి, రైల్వే, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల్లో పని చేస్తున్న కొంతమంది ఉద్యోగులకు బ్యాంకుల నుంచి రూ.60 లక్షల పర్సనల్ లోన్లు ఇప్పిస్తామని నమ్మించింది. లోన్ మంజూరు కావాలంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చార్జీలని వారి నుంచి రూ. 5,900 చొప్పున వసూలు చేశారు. ఆపై డబ్బులు అకౌంట్లలో జమ కావాలంటే ప్రాసెసింగ్ ఫీజు అని చెప్పి ఒక్కో ఉద్యోగి నుంచి రూ.1.70 లక్షలదాకా గుంజారు.
అయితే, డబ్బులు చెల్లించి నెలలు గడుస్తున్నా లోన్లు రాకపోవడంతో తాము చెల్లించిన డబ్బులు తిరిగి ఇవ్వాలని సర్కారు ఉద్యోగులు సంస్థ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు. దీంతో వాళ్లను బెదిరించడానికి ఆ సంస్థ లీగల్ నోటీసులు పంపిస్తున్నట్లుగా బాధితులు చెబుతున్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ ఇటీవల కొందరు బాధితులు పోలీసులను ఆశ్రయించారు. తాము చెల్లించిన డబ్బులు తిరిగి ఇప్పించాలని వేడుకుంటున్నారు.
