ఇకపై కేసీఆర్కు నిద్రలేని రాత్రులే : కిషన్ రెడ్డి

ఇకపై కేసీఆర్కు నిద్రలేని రాత్రులే : కిషన్ రెడ్డి

నిర్మల్ పట్టణంలో రైతులు, తమ పార్టీ నేతలు, కార్యకర్తలపై జరిగిన పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వ అక్రమాలను ప్రశ్నిస్తే.. బీజేపీ కార్యకర్తలపై దాడులు చేస్తారా..? అని ప్రశ్నించారు. ఇకపై కేసీఆర్ కు నిద్రలేని రాత్రులే ఉంటాయన్నారు. 

బీజేపీ కార్యకర్తలపై పోలీసులతో కేసీఆర్ సర్కారు దాడి చేయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు కిషన్ రెడ్డి. ప్రజాసమస్యలపై స్పందించడం చేతకాని రాష్ట్ర ప్రభుత్వం.. నిర్మల్ మాస్టర్ ప్లాన్ ను వ్యతిరేకిస్తూ నాలుగు రోజులుగా అమరణ నిరాహార దీక్ష చేస్తున్న ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోగ్యం క్షీణిస్తున్నా స్పందించకపోవడం దారుణం అన్నారు.

పోలీసుల దాడిలో గాయపడ్డ పార్టీ కార్యకర్తలకు మెరుగైన చికిత్స అందించాలని పార్టీ నాయకులను ఆదేశించారు కిషన్ రెడ్డి. నిర్మల్ మాస్టర్ ప్లాన్ కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వెనక్కు తీసుకోకపోతే.. కేసీఆర్ నిద్రలేని రాత్రులు గడపాల్సిందే అని హెచ్చరించారు. 

నిర్మల్ మున్సిపాలిటీ న్యూ మాస్టర్ ప్లాన్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. పట్టణంలో శనివారం (ఆగస్టు 19న) సాయంత్రం బీజేపీ నాయకులు, కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండ్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ క్రమంలో పోలీసులు, బీజేపీ నేతలకు మధ్య వాగ్వివాదం జరిగింది. పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో ఉద్రిక్తత ఏర్పడింది. పలువురు రైతులు, బీజేపీ కార్యకర్తలు గాయపడ్డారు.