హోంగార్డులతో 18 గంటలు పనిచేయిస్తున్నరు: కిషన్ రెడ్డి

హోంగార్డులతో 18 గంటలు పనిచేయిస్తున్నరు: కిషన్ రెడ్డి

హోంగార్డులకు జీతాలు, అలవెన్సులు పెంచాలన్నారు  కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ చీఫ్ కిషన్ రెడ్డి. హోంగార్డులు 18 గంటలు పనిచేస్తున్నారని చెప్పారు.    సరిగ్గా జీతాలు అందక ఆవేదనతో ఆత్మహత్య యత్నం చేసి అపోలో హాస్పిటల్ (DRDO) కంచన్ బాగ్ లో చికిత్స పొందుతున్న హోంగార్డ్ రవీందర్ ను కిషన్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన.. హోంగార్డ్ రవీందర్ ఆత్మహత్యాయత్నం బాధాకరమన్నారు.  హోంగార్డ్  రవీందర్  కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉండాలని కోరారు.  రవీందర్ ను కాపాడేందుకు డాక్టర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారని చెప్పారు. 

ఇది రాజకీయం చేయాల్సిన అంశం కాదని.. ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో హోంగార్డ్ లకు మద్దతు తెలపాలని సూచించారు కిషన్ రెడ్డి.  హోంగార్డులకిచ్చిన హామీలను కేసీఆర్ పట్టించుకోవడం లేదన్నారు. హోంగార్డుల సంఘాన్ని చీల్చేందుకు కేసీఆర్ యత్నిస్తున్నారని ఆరోపించారు.హోంగార్డుల పరిస్థితి ఎంతో దయనీయంగా ఉందని.. సమస్యలపై ప్రశ్నిస్తే  హోంగార్డులను వేధించారని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక హోంగార్డ్ లకు అండగా నిలుస్తామన్నారు. ఎవరూ కూడా అత్మహత్యలకు పాల్పడవద్దని.. పోరాటం చేయాలి కానీ.. ఆత్మ హత్య చేసుకోవద్దని సూచించారు కిషన్ రెడ్డి. 

జాబ్ రెగ్యులరైజ్​, జీతాలు రావట్లేదని రవీందర్ (37) అనే హోంగార్డ్ సెప్టెంబర్ 5న ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గోషామహల్​లోని కమాండెంట్ ఆఫీస్​లో ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు.