V6 News

సంక్రాంతికి ముందు 40 శాతం పెరిగిన పతంగ్ రేట్లు.. ఎందుకంటే..?

సంక్రాంతికి ముందు 40 శాతం పెరిగిన పతంగ్ రేట్లు.. ఎందుకంటే..?

సంక్రాంతి పండుగను తెలుగు ప్రజలు ప్రత్యేకంగా జరుపుకుంటారు. రంగవల్లుల నుంచి గాలి పటాల వరకు సెలబ్రేషన్స్ లో భాగంగా ఉంటాయి. ఇక కోడి పందాల విషయం ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. అయితే పిల్లల నుంచి పెద్దల వరకు పతంగ్ పోటాపోటీగా ఎగురవేస్తుంటారు. కానీ ఈ ఏడాది ఆ హుషారు కొద్దిగా ఖరీదైనదిగా మారనుంది.

సంక్రాంతి పండుగకు ముందు గాలిపటాల తయారీదారులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ముడిసరుకు ధరలు విపరీతంగా పెరగడంతో ఈ ఏడాది గాలిపటాల ధరలు ఏకంగా 40 శాతం వరకు పెరిగాయి. గాలిపటాల తయారీలో 60 ఏళ్ల చరిత్ర ఉన్న ఛత్రపతి శంభాజీనగర్‌లోని బుడ్డీ లేన్ ప్రాంతానికి చెందిన రాజ్‌పుత్ కుటుంబం ఈ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసింది. వీరు మహారాష్ట్రతో పాటు దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలకు కూడా గాలిపటాలను సరఫరా చేస్తుంటారు. సాధారణంగా పండుగ సీజన్‌లో వీరి దుకాణాల వద్ద కొనుగోలుదారులు కిటకిటలాడుతుంటారు. ప్రస్తుతం వీరి వర్క్‌షాప్‌లలో తయారీ ముమ్మరంగా సాగుతున్నా.. పెరిగిన ఖర్చులు వారిని కలవరానికి గురిచేస్తున్నాయని వ్యాపారులు వాపోతున్నారు. 

గత ఏడాదితో పోలిస్తే ఈసారి ముడిసరుకు ధరలు గణనీయంగా పెరిగాయని గాలిపటాల తయారీదారు అనిల్ రాజ్‌పుత్ పేర్కొన్నారు. గతేడాది రూ. 900 ఉన్న పేపర్ రిమ్ ధర ఈ ఏడాది రూ.11 వందలకు చేరిందని.. వెయ్యి వెదురు కర్రల కట్ట ధర గత ఏడాది రూ. 1,050 నుంచి పెరిగి ప్రస్తుతం రూ.2వేలు అయ్యిందని ఆయన పేర్కొన్నారు. ఈ పెరిగిన తయారీ ఖర్చులను వినియోగదారులకు వివరించి, పెరిగిన ధరలకు వారిని ఒప్పించడం కష్టంగా మారిందని చెప్పారు. గతేడాది రూ.5గా ఉన్న కనీస గాలిపటం ధర ఈసారి రూ.7కి పెరిగిందని సదరు వ్యాపారి చెబుతున్నారు

పెరిగిన ఖర్చులతో తమ సంప్రదాయ కుటుంబ వ్యాపారం భవిష్యత్తు గురించి కూడా అనిల్ రాజ్‌పుత్ ఆందోళన చెందుతున్నారు. గాలిపటాల తయారీలో అధిక శారీరక శ్రమ ఉంటుందని.. తర్వాతి తరం ఈ పనిని కొనసాగించడానికి ఆసక్తి చూపడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబాన్ని పోషించుకోవడానికి వయసు మీద పడినప్పటికీ తాము ఈ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నామని చెప్పారు. ఆగస్టు-సెప్టెంబర్ నెలల్లో గణేష్ ఉత్సవం తర్వాత దీని కార్యకలాపాలు మరింత ఊపందుకుంటాయని వారు చెబుతున్నారు. 

తమ గాలిపటాలు తెలంగాణలోని నిజామాబాద్‌తో పాటు నాందేడ్, వైజాపూర్, యేయోలా వంటి ప్రాంతాలకు సరఫరా అవుతాయని మరో కుటుంబ సభ్యుడు గోవర్ధన్ రాజ్‌పుత్ తెలిపారు. సంక్రాంతి సమీపిస్తున్నందున రాబోయే రోజుల్లో వ్యాపారం పుంజుకుంటుందని తమ కుటుంబం ఆశిస్తోందని అన్నారు.