ప్రాణాలు తీసిన గాలిపటాలు

ప్రాణాలు తీసిన గాలిపటాలు
  • మూడు కుటుంబాల్లో విషాదం
  • చిక్కడపల్లి, యాచారం, జీడిమెట్లలో ఘటనలు

హైదరాబాద్‌,వెలుగు: పతంగులు ప్రాణాలు తీశాయి. మూడు కుటుంబాల్లో విషాదం నింపాయి. గురు,శుక్ర వారాల్లో జీడిమెట్ల,చిక్కడపల్లి, రంగారెడ్డి జిల్లాలో ఘటనలు జరిగాయి.  వివరాల్లోకి వెళ్తే… సిటీలోని చిక్కడపల్లి పరిధి వీవీ నగర్‌‌లో పతంగి ఎగరేస్తూ  టీఆర్ఎస్ నాయకుడు బంగారు కృష్ణ(44) మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. ముషీరాబాద్‌ వీవీనగర్‌‌లో కృష్ణ  టెంట్ హౌస్  నడుపుతున్నాడు. గురువారం సాయంత్రం తన ఇంటిపైన పతంగి ఎగురవేస్తుండగా ప్రమాదవశాత్తు మూడో అంతస్తు నుంచి కింద పడిపోయాడు. కాంపౌండ్​వాల్​ ఇనుపరాడ్లపై పడడంతో కృష్ణకు తీవ్ర గాయాలయ్యాయి.  హాస్పిటల్‌కి తరలిస్తుండగా మృతి చెందాడు. చిక్కడపల్లి పోలీసులు కేసు ఫైల్​ చేశారు.

ఐరన్​ రాడ్​ తీసుకొచ్చి…

ఎల్​బీనగర్: పతంగి తీస్తుండగా కరెంట్​షాక్​తో బాలుడు మృతి చెందాడు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నల్లవెల్లిలో ఘటన చోటు చేసుకుంది.  గ్రామానికి చెందిన సాయిలు, వెంకటమ్మల కుమారుడు రాకేష్(13), శుక్రవారం పతంగి ఎగుర వేస్తుండగా కరెంట్​ వైర్లకి చిక్కింది. దాన్ని తీసేందుకు  ఇనుప రాడ్ తో కొట్టడడంతో విద్యుత్​షాక్ కొట్టి అతడు చనిపోయాడు. రక్షించేందుకు వెళ్లిన అతడి అక్క సోనికి గాయాలవగా ట్రీట్​మెంట్​ కోసం సిటీలోని హాస్పిటల్​కు తీసుకెళ్లారు. పోలీసులు కేసు ఫైల్​ చేశారు.

బిల్డింగ్​పై వాటర్​ పైప్​లైన్​ పట్టుకోగా..

జీడిమెట్ల: పతంగి ఎగురేస్తుండగా కరెంట్​ షాక్​తో ఓ బాలుడు చనిపోయాడు.  ఏపీలోని శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం, తుర్కశసనం గ్రామానికి చెందిన శ్యామ్​సుందర్​
పదేళ్ల కిందట సిటీకి వచ్చి షాపూర్​నగర్ పరిధి ఎన్ఎల్​బీనగర్​ కాలనీలో ఉంటూ వెల్డింగ్​ మెకానిక్​గా చేస్తున్నాడు.  ఒక బాబు, ఒక పాప ఉన్నారు. అతని కుమారుడు చరిత్​​కుమార్​(12) సంక్రాంతి సందర్భంగా  ఫ్రెండ్స్​తో  కలిసి గురువారం సాయంత్రం పతంగి ఎగుర వేయడానికి బయటకు వెళ్లాడు. ఓ బిల్డింగ్​పైన పతంగి ఎగురవేస్తుండగా పక్కనే ఉన్న వాటర్​ పైప్​ను పట్టుకోవడంతో కరెంట్​షాక్ కొట్టగా పడిపోయాడు. అతన్ని వెంటనే  స్థానికంగా ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే  చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. జీడిమెట్ల  పోలీసులు కేసు ఫైల్​ చేశారు.

ఇవీ చదవండి

పోషక విలువలున్నాయని ఎక్కువగా తింటే..

జూనియర్ బ్యాడ్మింటన్‌ ర్యాంకింగ్స్: సామియా @ వరల్డ్‌ నెంబర్-2

నెట్ బౌలర్‌గా వెళ్లి 3 ఫార్మాట్లలో అరంగేట్రం

లాండ్​లైన్​ నుంచి మొబైల్​కు కాల్​ చేయాలంటే ఇలా చేయాల్సిందే!