హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కోసం ప్రభుత్వం నియమించిన కేకే కమిటీ సోమవారం అమరజ్యోతి భవన్‌లో సమావేశం నిర్వహించింది. విద్యార్థి సంఘాలతో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో వివిధ వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఒక సంఘం ప్రతిపాదనను మరో సంఘం నేతలు వ్యతిరేకించడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో కమిటీ చైర్మన్ కే. కేశవరావు, ప్రొఫెసర్ కోదండరాం జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు.
2009 తర్వాత తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల పాత్రపై అభిప్రాయాలు తెలుసుకునేందుకే సమావేశం ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. సమావేశంలో పాల్గొన్న నేతలు అర్హులైన ఉద్యమకారులందరికీ 250 గజాల ఇంటి స్థలం, ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు అందించాలని డిమాండ్ చేశారు. ఫ్యూచర్ సిటీలోనూ స్థలాలు కేటాయించాలని పిడమర్తి రవి కోరారు.
ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మాట్లాడుతూ త్వరలో ఆల్‌పార్టీ మీటింగ్ పెడ్తామని తెలిపారు. ఉద్యమంలో పాల్గొన్న రచయితలు, జర్నలిస్టులు, ఉద్యోగుల వివరాలనూ సేకరిస్తామని కేకే చెప్పారు. ఈ నెలాఖరు వరకు అభిప్రాయ సేకరణ కొనసాగించి, ఆగస్టులో నివేదిక సమర్పిస్తామని కమిటీ వెల్లడించింది.
