IPL 2024: కోహ్లీ ఇచ్చిన బ్యాట్ విరగ్గొట్టిన భారత యువ క్రికెటర్

IPL 2024: కోహ్లీ ఇచ్చిన బ్యాట్ విరగ్గొట్టిన భారత యువ క్రికెటర్

ఎవరైనా ఏదేని వస్తువును బహుమతిగా ఇస్తే భద్రంగా దాచుకోవాలి. అదే విరాట్ కోహ్లీ వంటి స్టార్ బ్యాటర్ చేతి నుంచి అందితే ఎంతో అపురూపంగా చూసుకోవాలి. కలకాలం ఆ జ్ఞాపకాలు పదిలంగా ఉండేలా కాపాడుకోవాలి. అంతేకానీ, ఆ జ్ఞాపకాన్ని బద్దలు చేయకూడదు. అచ్చం ఇలాంటి పనే ఓ భారత యువ క్రికెటర్ చేశాడు. విరాట్ బహుమతిగా ఇచ్చిన బ్యాట్‌ను విరగ్గొట్టాడు. పైగా ఈ విషయాన్ని అతనికి వివరించి మరొకటి ఇవ్వాలని అభ్యర్థించాడు. అయితే, అందుకు కోహ్లీ అంగీకరించకపోవడం గమనార్హం. 

అసలేం జరిగిందంటే..?

మార్చి 29న బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలపడ్డాయి. ఆ  మ్యాచ్‌లో కోల్‌కతా 7 వికెట్ల తేడాతో బెంగళూరు జట్టును చిత్తు చేసింది. ఆ మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ త‌న దగ్గర ఉన్న బ్యాట్లలో ఒక దానిని కేకేఆర్ యువ బ్యాటర్ రింకూ సింగ్‌కు బ‌హుమ‌తిగా ఇచ్చాడు. దానిని జాగ్రత్తగా ఉంచుకోవాలని సూచించాడు.

కానీ, సరిగ్గా నెల రోజులు కూడా గడవకముందే రింకూ ఆ బ్యాట్‌ను విరగ్గొట్టాడు. ఆదే విష‌యాన్ని కోహ్లీకి రింకూ వివ‌రించాడు. స్పిన్నర్‌ను ఎదుర్కొనేట‌ప్పుడు బ్యాట్ విరిగిపోయింద‌ని చెప్పాడు. అంతేకాదు, త‌న‌కు కొత్త బ్యాట్ ఇవ్వాల్సిందిగా కోహ్లీని అభ్యర్థించాడు. అయితే,  అతని అభ్యర్థనను విరాట్ అంగీకరించలేదు. మరొక బ్యాట్ ఇస్తే నువ్వే ఇబ్బంది ప‌డ‌తావు అంటూ అతనికి ఫ‌న్నీగా సమాధానమిచ్చాడు. వీరి మ‌ధ్య జరిగిన సంభాష‌ణను కోల్‌క‌తా యాజమాన్యం.. త‌మ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది.