ముంబైపై కోల్‌కతా ఘన విజయం.. ప్లేఆఫ్స్ రేసులో నిలిచిన రహానే సేన

ముంబైపై కోల్‌కతా ఘన విజయం.. ప్లేఆఫ్స్ రేసులో నిలిచిన రహానే సేన

MI vs KKR: ఐపీఎల్ 2026 లీగ్ దశలో భాగంగా కోల్‌కతాలోని చారిత్రాత్మక ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన హై-వోల్టేజ్ పోరులో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) అద్భుత విజయాన్ని అందుకుంది. పీకల్లోతు కష్టాల్లో ఉన్న మ్యాచ్‌ను మనీష్ పాండే, రోవ్‌మన్ పావెల్ తమ క్లాస్ మాస్ ఇన్నింగ్స్‌ని చక్కదిద్దగా, చివర్లో రింకూ సింగ్ ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. దీంతో ముంబై ఇండియన్స్‌పై కేకేఆర్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. అంతకుముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది.

ఆదిలోనే బిగ్ షాక్: 
148 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన కోల్‌కతాకు స్టార్ట్ అస్సలు బాలేదు. ఓపెనర్ ఫిన్ అలెన్ (8) ను ముంబై పేసర్ దీపక్ చాహర్ మొదటి ఓవర్లోనే క్లీన్ బౌల్డ్ చేయడంతో కేకేఆర్ తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన బ్యాటర్లు పరుగులు తీయడానికి కాస్త శ్రమించాల్సి వచ్చింది. అయితే మంచి టచ్‌లో కనిపించిన కెప్టెన్ అజింక్య రహానే (21) వరుసగా రెండు బౌండరీలు కొట్టి స్పీడ్ పెంచే ప్రయత్నం చేశాడు. కానీ, ముంబై బౌలర్ కార్బిన్ బోష్ వేసిన కిరాక్ బంతికి రహానే వికెట్ కీపర్ రికెల్టన్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఈ కీలకమైన మ్యాచ్‌లో మరోసారి కామెరాన్ గ్రీన్ (4) తీవ్రంగా నిరాశపరిచాడు. బోష్ బౌలింగ్‌లోనే భారీ షాట్‌కు వెళ్లి క్యాచ్ అవుట్‌గా వెనుదిరిగాడు.

ఆదుకున్న మనీష్ పాండే: 
టాప్ ఆర్డర్ విఫలమైన వేళ వన్ డౌన్‌లో క్రీజులోకి వచ్చిన మనీష్ పాండే ఇన్నింగ్స్‌ను అద్భుతంగా చక్కదిద్దాడు. వికెట్లు పడుతున్నా ఒత్తిడిని దరిచేరనీయకుండా రోవ్‌మన్ పావెల్‌తో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చే బాధ్యతను భుజాన వేసుకున్నాడు. ముంబై బౌలర్లపై దూకుడుగా ఆడుతూ స్కోరు బోర్డును పరిగెత్తించాడు. అయితే హాఫ్ సెంచరీకి చేరువవుతున్న తరుణంలో జస్ప్రీత్ బుమ్రా వేసిన ఒక అన్‌ప్లేయబుల్ బంతికి మనీష్ పాండే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో తృటిలో తన అర్ధ సెంచరీని మిస్ చేసుకున్నాడు.

ప్లేఆఫ్స్ రేసులో కేకేఆర్:
మనీష్ పాండే అవుటైన కాసేపటికే అల్లా ఘజన్‌ఫర్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడిన రోవ్‌మన్ పావెల్ బౌండరీ లైన్ దగ్గర కార్బిన్ బోష్‌కు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. కీలక వికెట్లు పడటంతో మ్యాచ్ మళ్లీ ఆసక్తికరంగా మారింది. కానీ చివర్లో బ్యాటింగ్‌కు వచ్చిన రింకూ సింగ్, అనుకూల్ రాయ్ ఎలాంటి టెన్షన్ పడకుండా సింగిల్స్, బౌండరీలతో మిగతా మ్యాచ్‌ను కూల్‌గా పూర్తి చేశారు.