రాహుల్ క్లాస్, గిల్ మాస్.. తొలి రోజే ఆఫ్ఘన్పై భారత్దే ఆధిపత్యం

రాహుల్ క్లాస్, గిల్ మాస్.. తొలి రోజే ఆఫ్ఘన్పై భారత్దే ఆధిపత్యం

IND vs AFG Test: న్యూ చండీగఢ్‌లోని ముల్లాన్‌పూర్ పీసీఏ మైదానంలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా తొలి రోజే భారీ స్కోరు సాధించి మ్యాచ్‌పై ఫుల్ గ్రిప్ సంపాదించింది. మన బ్యాటర్లు ఆఫ్ఘన్ బౌలర్లను చెడుగుడు ఆడుకోవడంతో, మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 85 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 368 పరుగుల కొండంత స్కోరును బోర్డుపై పెట్టింది. 

జైస్వాల్ ఫ్లాప్.. సాయి సుదర్శన్ కిర్రాక్ షో: 
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు వచ్చిన భారత్‌కు ఆశించిన మేర ఆరంభం లభించలేదు. ఇన్నింగ్స్ ప్రారంభమైనప్పటి నుంచే దూకుడుగా ఆడుతూ, బౌండరీలతో ఆఫ్ఘనిస్థాన్ బౌలర్లపై ఒత్తిడి పెంచిన ఓపెనర్ యశస్వీ జైస్వాల్ ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయాడు. ఆయన 24 రన్స్ మాత్రమే చేసి సలీం సఫీ బౌలింగ్‌లో అఫ్సర్ జజాయ్‌కి క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. ఆ తర్వాత ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన సాయి సుదర్శన్ అద్భుతంగా ఆడాడు. కిర్రాక్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని శతకం వైపు దూసుకెళ్తున్న అతడు కూడా దురదృష్టవశాత్తూ సలీం సఫీ బౌలింగ్‌లోనే పెవిలియన్‌కు చేరుకున్నాడు.

కేఎల్ రాహుల్ క్లాస్ సెంచరీ: 
ఇంకోవైపు ఓపెనర్ కేఎల్ రాహుల్ మస్తు నిలకడగా ఆడుతూ ఆఫ్ఘన్ బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టాడు. గ్రౌండ్‌లో క్లాస్ షాట్లతో అలరిస్తూ 164 బంతుల్లో 100 పరుగులు పూర్తి చేసుకున్నాడు. అయితే శతకం మార్కు రీచ్ అయిన తర్వాత బంతికే జీఆర్ రెహమాన్ బౌలింగ్‌లో రాహుల్ క్యాచ్ అవుట్ అయ్యాడు. దీంతో 247 పరుగులకే కీలకమైన మూడు వికెట్లను ఇండియన్ టీమ్ నష్టపోయింది.

చెలరేగిన శుభ్‌మన్ గిల్: 
మూడు వికెట్లు పడ్డాక క్రీజులోకి వచ్చిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్ వచ్చి రావడంతోనే బౌండరీలతో ఆఫ్ఘనిస్థాన్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. లీడర్ అంటే ఇలాగే ఉండాలన్నట్టు అటాకింగ్ గేమ్ ఆడుతూ.. కెప్టెన్‌గా తన 6వ సెంచరీని, వ్యక్తిగతంగా 11వ సెంచరీని గిల్ పూర్తి చేసుకున్నాడు.

►ALSO READ | సూర్యని అందుకే తప్పించాం.. అసలు ముచ్చట బయట పెట్టిన అజిత్ అగార్కర్  

సిక్సర్ల వర్షం కురిపించిన రిషభ్ పంత్: 
గిల్‌కు తోడుగా వచ్చిన వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ సైతం గ్రౌండ్ నలుమూలలా భారీ సిక్సర్లు కొడుతూ.. భారత జట్టు స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలోనే కేవలం 70 బంతులు ఆడి 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ హాఫ్ సెంచరీతో పంత్ తన టెస్ట్ కెరీర్‌లో 19వ అర్థ శతకాన్ని నమోదు చేసుకున్నాడు. కాగా తొలి రోజే 368 రన్స్ కొట్టి ఆఫ్ఘన్ టీమ్‌కు ముచ్చెమటలు పట్టించిన ఇండియన్ బ్యాటర్లు.. రెండో రోజు ఇంకా ఎంత భారీ స్కోర్ చేసి మ్యాచ్‌ను తమ వైపు తిప్పుకుంటారో అనేది వేచి చూడాలి.