IND vs WI 1st Test: కేఎల్ క్లాసికల్ ఇన్నింగ్స్.. రాహుల్ సెంచరీతో తొలి ఇన్నింగ్స్‌లో ఇండియాకు ఆధిక్యం

IND vs WI 1st Test: కేఎల్ క్లాసికల్ ఇన్నింగ్స్.. రాహుల్ సెంచరీతో తొలి ఇన్నింగ్స్‌లో ఇండియాకు ఆధిక్యం

వెస్టిండీస్ తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ సెంచరీతో కదం తొక్కాడు. రెండో రోజు ఆటలో భాగంగా  శుక్రవారం (అక్టోబర్ 3) రాహుల్ తన సెంచరీ మార్క్ అందుకున్నాడు. అహ్మదాబాద్ వేదికగా నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో తొలి రోజు హాఫ్ సెంచరీ చేసిన కేఎల్.. రెండో రోజు జట్టు కోసం పట్టుదలగా ఆడుతూ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 190 బంతుల్లో శతకం బాదిన రాహుల్ ఇన్నింగ్స్ లో 12 ఫోర్లున్నాయి. రాహుల్ టెస్ట్ కెరీర్ లో ఇది 11వ సెంచరీ కావడం విశేషం. రాహుల్ సెంచరీతో టీమిండియాకు తొలి ఇన్నింగ్స్ లో ఆధిక్యం సంపాదించింది. 

రాహుల్ తో పాటు రెండో రోజు తొలి సెషన్ లో గిల్ హాఫ్ సెంచరీ చేయడంతో ఇండియా రెండో రోజు లంచ్ సమయానికి 3 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది.  రెండు వికెట్ల నష్టానికి 121 పరుగులతో రెండో రోజు ఆట ప్రారంభించిన ఇండియా తొలి సెషన్ లో 97 పరుగులు రాబట్టి ఒక వికెట్ మాత్రమే కోల్పోయింది. ప్రస్తుతం క్రీజ్ లో రాహుల్ (100), ధృవ్ జురెల్ (14) ఉన్నారు. రెండో రోజు తొలి సెషన్ ముగిసే సరికి టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 56 పరుగుల ఆధిక్యంలో ఉంది. చేతిలో 7 వికెట్లు ఉండడంతో తొలి ఇన్నింగ్స్ లో భారీ ఆధిక్యం సంపాదించడం ఖాయంగా కనిపిస్తుంది. 

రెండు వికెట్ల నష్టానికి 121 పరుగులతో రెండో రోజు ఆట ప్రారంభించిన ఇండియా ఇన్నింగ్స్ ను కెప్టెన్ గిల్, రాహుల్ ముందుకు తీసుకెళ్లారు. తొలి అరగంట జాగ్రత్తగా ఆడుతూ డిఫెన్స్ కే పరిమితమయ్యారు. తొలి గంట ముగిసిన తర్వాత గిల్, రాహుల్ జోరు పెంచారు. బౌండరీలు కొడుతూ స్కోర్ కార్డును వేగంగా ముందుకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో గిల్ 94 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. 50 కొట్టిన వెంటనే రివర్స్ స్వీప్ చేసే క్రమంలో గిల్ స్లిప్ లో దొరికిపోయాడు. దీంతో రాహుల్, గిల్ మధ్య 98 పరుగుల భాగస్వామ్యానికి తెర పడింది. 

గిల్ ఔటైన తర్వాత వికెట్ కీపర్ జురెల్ తో కలిసి రాహుల్ తన సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఛేజ్ బౌలింగ్ లో సింగిల్ తీసుకొని తన 100 పరుగుల మార్క్ అందుకున్నాడు. లంచ్ కు వరకు జురెల్, రాహుల్ వికెట్ పడకుండా తొలి సెషన్ ముగించారు. వీరిద్దరూ నాలుగో వికెట్ కు అజేయంగా 30 పరుగులు జోడించారు. ఈ సెషన్ లో టీమిండియా 29 ఓవర్లు ఆడి 97 పరుగులు చేసి గిల్ వికెట్ కోల్పోయింది. వెస్టిండీస్ బౌలర్లలో ఛేజ్ రెండు వికెట్లు పడగొట్టాడు. సీల్స్ కు ఒక వికెట్ దక్కింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ తమ తొలి ఇన్నింగ్స్ లో 162 పరుగులకే ఆలౌట్ అయింది.