ప్రైవేటు ఆస్పత్రులకెళ్లి డబ్బులు వృథా చేసుకోవద్దు

ప్రైవేటు ఆస్పత్రులకెళ్లి డబ్బులు వృథా చేసుకోవద్దు
  • ప్రత్యేక క్యాంపులు పెట్టి పేషెంట్ల గుర్తింపు  
  • ప్రైవేటు ఆస్పత్రులకెళ్లి డబ్బులు వృథా చేసుకోవద్దని సూచన
  • రూ.95 వేల విలువైన ఇంప్లాంట్లు వేస్తాం: హరీశ్​

సిద్దిపేట, వెలుగు : రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా దవాఖానాల్లోనూ మోకాలి చిప్పల మార్పిడి ఆపరేషన్లను ప్రారంభించనున్నట్లు ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. ప్రస్తుతం గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల్లో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ సేవలను ఇకపై అన్ని జిల్లా ఆస్పత్రులకూ విస్తరిస్తామని తెలిపారు. సిద్దిపేట జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఇటీవల మోకాలి చిప్పల మార్పిడి (నీ రీప్లేస్మెంట్) ఆపరేషన్లు చేయించుకున్న ముగ్గురు పేషెంట్లను మంగళవారం పరామర్శించిన తర్వాత మంత్రి మీడియాతో మాట్లాడారు. సిద్దిపేటలో ముగ్గురు పేదలకు ఆపరేషన్లు చేశారని, ప్రస్తుతం వారు నడవగలుగుతున్నారని చెప్పారు. నియోజకవర్గంలో ఇటీవల ప్రత్యేక క్యాంపు పెట్టి మోకాలి చిప్పల మార్పిడి అవసరమైన 70 మందిని గుర్తించారని, వారిలో అత్యవసరమైన ముగ్గురికి ఆపరేషన్ చేశారన్నారు. 

సిద్దిపేట ఆస్పత్రిలో ప్రతి వారం 4 ఆపరేషన్లు

ప్రైవేట్ ఆస్పత్రుల్లో రూ.5 లక్షలు ఖర్చయ్యే మోకాలి చిప్పల మార్పిడి ఆపరేషన్ ను ఇకపై ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగానే చేయిస్తామని మంత్రి హరీశ్ రావు చెప్పారు. ఇకపై అన్ని జిల్లాల్లో, నియోజకవర్గాల్లో ప్రత్యేక క్యాంపులు పెట్టి నీ రీప్లేస్మెంట్ అవసరమైన వారిని గుర్తించి ఫ్రీగా ఆపరేషన్లు చేయిస్తామని వెల్లడించారు. మోకాలి చిప్పల ఆపరేషన్ల కోసం ఎవరూ ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి రూ.లక్షలు వృథా చేసుకోవద్దని చెప్పారు. రూ. 95 వేల చొప్పున ఖర్చు చేసి దిగుమతి చేసుకున్న ఇంప్లాంట్లను ఈ ఆపరేషన్లలో వాడుతున్నామని తెలిపారు. సిద్దిపేట ఆస్పత్రిలో ప్రతి వారం 4 నుంచి 6 మోకాలి చిప్పల ఆపరేషన్లు జరిగేలా చూడాలని డాక్టర్లకు సూచించారు. ఆపరేషన్ చేయించుకుని, కోలుకున్న ముగ్గురు పేషెంట్లకు మంత్రి మందులు అందజేశారు. తర్వాత ఆస్పత్రిలోని పేషెంట్లతో మాట్లాడారు. పేషెంట్లు, వారి అటెండెంట్లకు ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని ఆస్పత్రి సిబ్బందిని ఆదేశించారు.