బిడెన్ అంత పదునైన వ్యక్తి కాదు: ట్రంప్

బిడెన్ అంత పదునైన వ్యక్తి కాదు: ట్రంప్

న్యూఢిల్లీ: అమెరికాలో అధ్యక్ష ఎన్నికల వేడి రోజురోజుకీ పెరుగుతోంది. డొనాల్డ్ ట్రంప్-జో బిడెన్ ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. తాజాగా వీ-జే డే స్పీచ్ లో మరోమారు బిడెన్ పై ట్రంప్ విరుచుకుపడ్డారు. 78 ఏళ్ల వయస్సున్న ఒక వ్యక్తి తనకు తెలుసునని, ఆయన అంత పదునైన వ్యక్తి కాదంటూ బిడెన్ గురించి వ్యంగ్యంగా మాట్లాడారు. ‘మన దేశ చరిత్రలో ఈ ఎన్నికలు చాలా ప్రాముఖ్యం కలిగినవి. పెద్ద పెద్ద సమస్యలతో ఇబ్బందులు పడుతున్న ప్రజల నుంచి మనం దూరంగా పారిపోతున్నాం’ అని ట్రంప్ అన్నారు. మెయిల్ ద్వారా ఓట్లు వేసే వాళ్లను ట్రంప్ ప్రోత్సహించారు. మెయిల్ నుంచి ఒక ఓటు, బ్యాలెట్ లో ఒక ఓటు వేయాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మెయిల్ లో ఓటేయడం ద్వారా తమ మెయిల్ ఓటు కౌంట్ అయిందా లేదా చూసుకోవచ్చునన్నారు. మరోవైపు కరోనా వారియర్లను గౌరవించకుండా, ప్రజారోగ్యాన్ని పదే పదే నిర్లక్ష్యం చేస్తూ తన రాజకీయ అవసరాల కోసం వాడుకుంటున్నారని ట్రంప్ పై బిడెన్ కామెంట్స్ చేశారు.