చాలా మంది ప్రజలు తమ లైఫ్‌స్టైల్‌లో భాగంగా సిగరెట్లు కాల్చడం, మందు తాగటాన్ని లైట్ తీసుకుంటుంటారు. అయితే ఈ అలవాట్లు వ్యక్తుల ఆరోగ్యానికి మాత్రమే కాకుండా ఆర్థికంగానూ నష్టాన్ని కలిగిస్తాయి. అదెలా అంటే సదరు అలవాట్లు ఉన్న వ్యక్తి ఇన్సూరెన్స్ కొనుగోలు కోసం ప్రయత్నించినప్పుడు బీమా కంపెనీలు వారి అలవాట్లను పరిగణలోకి తీసుకుని ప్రీమియం లెక్కిస్తాయి. అందువల్ల వారు చెల్లించాల్సిన ఇన్సూరెన్స్ ప్రీమియం సాధారణ వ్యక్తులతో పోల్చితే ఎక్కువగా ఉంటుంది.
ICICI లాంబార్డ్ ఇండియా వెల్‌నెస్ ఇండెక్స్ 2024 ప్రకారం.. సర్వేలో పాల్గొన్న వారిలో సుమారు 25% మంది రెగ్యులర్‌గా పొగతాగుతున్నారని, 20% మంది రోజూ మద్యం సేవిస్తున్నట్లు వెల్లడైంది. ఏటా మద్యం వల్ల 26 లక్షల మంది, పొగతాగడం వల్ల 70 లక్షలకుపైగా ప్రజలు మరణిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కలు చెబుతున్నాయి. అందుకే ఈ అలవాట్లను ఇన్సూరెన్స్ కంపెనీలు “హై రిస్క్ ఫ్యాక్టర్స్”గా పరిగణిస్తాయి.
ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునే ముందు.. కంపెనీలు పాలసీదారుడి ఆరోగ్య వివరాల్లో మద్యం, పొగతాగడం వంటి అలవాట్లను స్పష్టంగా అడుగుతాయి. వీటికి సంబంధించిన వివరాలు దాచిపెడితే భవిష్యత్తులో క్లెయిమ్ రిజెక్ట్ అవకాశాలు ఎక్కువని పాలసీబజార్ డైరెక్టర్ అమిత్ ఛబ్రా వెల్లడించారు. బీమా కంపెనీల రూల్స్ ప్రకారం పాలసీ కొనే వ్యక్తి ఏదైనా సమాచారాన్ని పాలసీ ఇచ్చిన కంపెనీ వద్ద 5 ఏళ్ల కాలం పూర్తి కావటానికి మునుపు దాచిపెట్టినట్లు గుర్తిస్తే క్లెయిమ్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ఉదాహరణకు.. లివర్ సిర్రోసిస్ వంటి వ్యాధులు మద్యం సేవనంతో నేరుగా సంబంధమున్నట్లయితే ఇన్సూరెన్స్ కంపెనీ క్లెయిమ్‌ను తిరస్కరించవచ్చు. కానీ ఎయిర్ పొల్యూషన్ వంటి ఇతర కారణాల వల్ల కలిగే ఊపిరితిత్తుల వ్యాధులకు మాత్రం క్లెయిమ్ ఆమోదించే అవకాశం ఉంటుంది.
పాలసీదారులు తమ క్లెయిమ్ తిరస్కరించబడితే మొదట ఇన్సూరెన్స్ కంపెనీ కంప్లయింట్ అధికారి వద్ద ఫిర్యాదు చేయాలి. పరిష్కారం రాకపోతే ఇన్సూరెన్స్ అంబుడ్స్‌మన్ లేదా కన్స్యూమర్ కోర్టును ఆశ్రయించవచ్చు. అందువల్ల ఎవరైనా కొత్తగా పాలసీ తీసుకునేటప్పుడు నిజాయితీగా అన్ని వివరాలు వెల్లడించడం మంచిది. ఇది మీ ప్రీమియం లెక్కింపును పారదర్శకంగా చేయడమే కాక.. భవిష్యత్తులో క్లెయిమ్ వివాదాలనుంచి కూడా రక్షిస్తుంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంత ముఖ్యమో.. ఇన్సూరెన్స్ పాలసీని కాపాడుకోవడమూ అంతే ముఖ్యమని గుర్తుంచుకోండి.
